Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణా టిడిపికి లీడర్ కావాలి

 కేంద్ర మంత్రి, మంచి వ్యాపార దక్షుడు, కార్యసాధకుడు, వివాదాలను అవలీలగా చిటికెన వేలుతో తోసి అవతల పడేయగల సమర్ధుడు అయిన సుజనా చౌదరికి  పార్టీని అప్పగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన  పార్టీలో మొదలయిందని మీడియాలో వినబడుతూ ఉంది.

Naidu searching for a leader to build TDP  in Telangana

లోకేశ్ నాయుడు తెలంగాణాను వదిలేసి చాలా కాలమయింది.

 

సెలవుల్లో ఇంటికి రావడానికి తప్ప ఆయనిక తెలంగాణలో కాలుమోపక పోవచ్చు. తెలంగాణాలో ఆయనకు ప్రజామోదం లేదని జిహెచ్ ఎంసి ఎన్నికలతోనే తెలిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా పార్టీ జాతీయధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గాని,  జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన లోకేశ్ నాయుడు గాని తెలంగాణాలో కాలుమోపలే. వచ్చిందంతా హైదరాబాద్లో బిజినెస్, ఇల్లు చూసుకునేందుకే. ఇపుడు లోకేశ్ మంత్రయ్యారు.అందునా ఐటి. దానికితోడు పోటీ కెటిఆర్ తో...ఇక తెలంగాణా గురించి  ఆలోచించే తీరుబడి  దొరకదడం కష్టం.

 

బిసి నాయకత్వం కూడా  పార్టీకి అచ్చిరాలే. ముఖ్యమంత్రి క్యాండిడేట్ అనుకున్న ఆర్ కృష్ణయ్య, 2014 లో పార్టీ పరాజయం పాలు కావడం, తర్వాత ఉన్న ఎమ్మెల్యేలు టిఆర్ ఎస్ లోకి ఉడాయించడంతో  పార్టీమీద మమ కారం వదులుకున్నాడు. ఏదో పార్టీలో ఉన్నాడనిపించుకోవడం తప్ప బయటెపుడు ఆయన టిడిపిలీడర్ గా కాకుండా బిసి సంక్షేమ సంఘం నాయకుడిగా తిరుగుతున్నారు.

 

ఉన్న  మరొక నాయకుడు రేవంత్ రెడ్డి. నోరున్నవాడేగాని, నోటుకు వోటు బలయిపోయాడు.దీన్నుంచి బయటపడేందుకు వాళ్ల బాసు అమరావతి కివెళ్లిపోయాడుగాని, రేవంత్ ఎక్కడికి పోగలడు? ఇక టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ... రాజకీయంగా కూడా బిసియే. పార్టీని ఉత్తేజపరిచేందుకు అసవరమయిన వనరులున్నవాడు కాదు. చేతి వాటం తెలిసిన వాడు కాదు.

 

 2019 దగ్గిర పడుతూ ఉండటంతో ఈ పరిస్థితుల్లో పార్టీకి దిక్కెవరు? అనే ప్రశ్న  టిటిటిడిలో నానుతూ వస్తున్నది.  బిజెపి అమిత్ షాలాగా ఈ ప్రాంతంలో జిల్లా జిల్లాలో వూరూర మీటింగ్ పెట్టే సాహసం చంద్రబాబు, లోకేశ్ బాబు  ఇప్పట్లో చేయలేరు. వాళ్ల చేతులు పూర్తిగా కాలిపోయాయి.

 

 ఇలాంటపుడొక ఆత్మీయుడెవరయినా దొరికితే, తెలంగాణా జాగీర్దారుగా చేయాలనుకుంటున్నట్లు  మీడియాలో వార్తలొస్తున్నాయి.  

 

ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి, మంచి వ్యాపార దక్షుడు, కార్యసాధకుడు, వివాదాలను అవలీలగా చిటికెన వేలు తో తోసి అవతల పడేయ గల సమర్ధుడు అయిన సుజనా చౌదరికి అప్పగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా పార్టీలో మొదలయిందని మీడియా లో వినబడుతూ ఉంది.

 

ఇందులో భాగంగానే ఈ మధ్య జరిగిన టిటిడిపి సమావేశానికి కూడా సుజనా చౌదరి కూడ హాజరయ్యారు. ఏ విధంగా చూసినా టిడిపి ఫస్టు ఫ్యామిలీకి ఈ భూమండలమ్మీద అంతకంటే గొప్ప సన్నిహితుడు, హితుడు, ఆత్మీయుడు కనిపించడు.  కాబట్టి  ఆంధ్రోడని తెలంగాణా వాళ్ల అరచి గోల చేసినా దానికి కూడా సమాధానం చెప్పగల వాడు సుజనాచౌదరి. 

 

అంతేకాదు, ఆయన వల్ల తెలంగాణా ప్రభుత్వానికి కూడా పెద్ద సమస్యలు రావు. ఎందుకంటే, హైదరాబాద్ కేంద్రంగా పని చేసే సుజనా, రేవంత్ లాగా టిడిపిని ఏకి పారేసేంత వీరటిడిపి నాయకుడు  కాదు. లౌక్యం తెలిసిన వాడు. ఆయన నాయకత్వంలో రాజకీయాలు నడస్తాయి. వ్యాపారమూ నడుస్తుంది. అదీ లాభమే. అందువల్ల ఆయననే  తెలంగాణా టిడిపి ఇన్ చార్జ్ చేస్తారనేది మీడియా లో వస్తున్నవార్తలు. దీన్ని కాదనగలిగే ఛావ  టిడిపిలో ఎవరికుంటుంది?

Follow Us:
Download App:
  • android
  • ios