నాగర్‌కర్నూల్: ఓ మహిళను నమ్మించి అత్యాచారం చేసి హత్యచేసిన సాధువు మట్కాస్వామిని నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు.

ఈ నెల 2వ తేదీన నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అడవిలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. మృతి చెందిన మహిళను ముంబై వాసిగా పోలీసులు గుర్తించారు.

ఆలయాలను సందర్శన కోసం ఆమె దేశంలోని పలు ప్రాంతాలను తిరిగే అలవాటు ఉన్నట్టుగా పోలీసులు చెప్పారు. గత ఏడాది డిసెంబర్ మాసంలో తిరుపతికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో చెప్పి వచ్చింది.

ఈ ఏడాది జనవరి మాసంలో ఆమె శ్రీశైలంలో మల్లిఖార్జునస్వామి దర్శనం కోసం వచ్చింది. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా సమంతమలైకి చెందిన సాధువు మట్కాస్వామి అలియాస్ పిలకస్వామి కూడ  దేశంలోని పలు ఆలయాలను తిరుగుతుంటారు.

కొంత కాలంగా మట్కాస్వామి కూడ శ్రీశైలం ఆలయ పరిసరాల్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ముంబైకి చెందిన మహిళతో ఆయనకు పరిచయమైంది. శ్రీశైలం సమీపంలోని అక్కమహాదేవి  ఆలయం చాలా మహిమాన్వితమైందని ఆ మహిళకు మట్కాస్వామి చెప్పారు.

ఈ ఆలయాన్ని దర్శించుకొని వెళ్లాలని ఆమె భావించింది. ఈ ఏడాది జనవరి 25న ఇద్దరూ నల్లమల అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. ఆలయానికి వెళ్లే దారిలో మట్కాస్వామి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను హత్య చేశాడు.

ఈ నెల 2వ తేదీన అటవీ శాఖ సిబ్బంది ఈ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహానికి సమీపంలో ఆమె ఆధార్ కార్డు, ఆమె బస చేసిన గది రశీదులు లభ్యమయ్యాయి.

వీటి ఆధారంగా పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మరో వైపు మృతురాలు బస చేసిన హోటల్ గదికి సమీపంలో ఉన్న సీసీటీవీ రికార్డులను పరిశీలించిన పోలీసులు నిందితుడు మట్కాస్వామిని గుర్తించారు. అతడిని అరెస్ట్ చేశారు.