హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెసుకు భారీ షాక్ తగలబోతోంది. పార్టీ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి బిజెపిలో చేరబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. అదే జరిగితే కాంగ్రెసుకు తిరుగులేని దెబ్బనే అవుతుంది. ప్రస్తుతం జానారెడ్డి కేరళలో ఉన్నారు. ఆయనను ఇప్పటికే బిజెపి నేతలు సంప్రదించినట్లు తెలుస్తోంది. 

బిజెపి ఇచ్చిన ఆపర్ కు జానారెడ్డి పచ్చజెండా ఊపినట్లు కూడా చెబుతున్నారు ఈ నెల 7వ తేదీన ఆయన బిజెపిలో చేరే అవకాశాలున్నాయని చెబుతున్నారు. జాతీయ మీడియాలో ఈ మేరకు వార్తాకథనం వచ్చింది. నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో ఆయన బిజెపి తరఫున పోటీకి దిగే అవకాశాలున్నాయని సమాచారం. 

నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెసు తరఫున పోటీ చేసి జానారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. రాజకీయంగా కూడా అంత సందడి చేయడం లేదు. నోముల నర్సింహయ్య మృతితో నాగార్జునసాగర్ కు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. దీంతో ఆయన తిరిగి క్రియాశీలం అవుతున్నట్లు తెలుస్తోంది.

దుబ్బాక ఉప ఎన్నికలో బిజెపి విజయం సాదించడం, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలను సాధించడం కారణంగా, కాంగ్రెసుకు తెలంగాణలో భవిష్యత్తు లేదని నిర్దారణ కావడం వల్ల జానారెడ్డి ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. జానారెడ్డి పార్టీ మారకపోతే బిజెపిలో చేరేందుకు ఆయన కుమారుడు రఘువీర్ సిద్ధపడినట్లు తెలుస్తోంది.

బిజెపిలో చేరి నాగార్జునసాగర్ నుంచి పోటీ చేయాలని రఘువీర్ నిర్ణయమించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జనారెడ్డి బిజెపిలో చేరి తానే పోటీ చేయడం ఉత్తమమనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. జానారెడ్డి బిజెపిలో చేరితే టీఆర్ఎస్ కు నాగార్జునసాగర్ లో విజయం అంత సులభం కాకపోవచ్చు.