Asianet News TeluguAsianet News Telugu

నాగార్జున సాగర్ ఎడమకాల్వకు గండి.. 30 మీటర్ల మేర కొట్టుకుపోయిన కట్ట...

నల్గొండలోని నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు భారీ గండి పడింది. దీంతో కట్ట 30 మీటర్ల మేర కొట్టుకుపోయింది. ఈ నీరంతా నర్సింహులగూడెం మీదుగా, నిడమనూరు సమీపంలోని వాగు ద్వారా వెళుతుండటంతో నిడమనూరుకు ముప్పు తప్పింది. 

Nagarjuna Sagar project left canal breached, Disruption of traffic in nalgonda
Author
First Published Sep 8, 2022, 7:40 AM IST

నల్గొండ : నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం- వేంపాడు గ్రామాల మధ్య నారెళ్లగూడ మేజర్ సమీపంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కట్టకు బుధవారం భారీ గండి పడింది. సాయంత్రం 5.45గం.లకు యూటీ వద్ద నీరు కాలువలో సుడులు తిరుగుతూ ఉండటం, కట్టకింది భాగం నుంచి నీరు అధికంగా వెళుతుండటం గమనించారు. మొదట అయోమయానికి గురైన రైతులు, తర్వాత బుంగ పడిందని నిర్ధారణ చేరుకున్నారు. సాగర్ ఎడమ కాల్వకు 32.109 కిలోమీటర్ వద్ద ఉన్న యూటీకి (అండర్ టన్నెల్) కుడి పక్కన గండి పడి తర్వాత మొత్తం కొట్టుకుపోయింది. బుంగ కాస్తా పెరిగి గంటలోనే కట్టకు గండి పడింది. కట్ట 30 మీటర్ల మేర కొట్టుకుపోయింది. 

సాగర్ నుంచి వచ్చే నీరంతా పొలాలకు నర్సింహులగూడెం మీదుగా, నిడమనూరు సమీపంలోని వాగులోకి చేరాయి. వాగు ద్వారా నీరు వెళుతుండటంతో నిడమనూరుకు ముప్పు తప్పింది. గండి పడిన ప్రాంతానికి తహశీల్దార్ ప్రమీల, మిర్యాల గూడ డీఎస్పీ వెంకటేశ్వరరావు వెళ్లి పరిశీలించారు. పూర్తిగా చీకటి పడడంతో ఎక్కడ ఎంతమేర గండిపడిందో ఓ అంచనా వేయలేకపోయారు. విషయం తెలుసుకున్న సాగర్ ప్రాజెక్టు అధికారులు నాగార్జునసాగర్ ఎడమ కాలువకు బుధవారం రాత్రి నీటిని నిలిపి వేశారు. నిడమనూరు- నర్సింహులగూడెం మధ్య  కోదాడ- జడ్చర్ల జాతీయ రహదారిపైకి నీరు రావడంతో ఒక పక్కనే రాకపోకలకు అనుమతిస్తున్నారు.

హైదరాబాద్‌ను వణికించిన భారీ వర్షం.. ప్రమాదకరంగా మూసీ, మరో మూడు రోజులు ఇంతే

ఆధునీకరణకు ముందు రెండు చోట్ల గండ్లు..
సాగర్ ఎడమ కాలువ కట్టకు ఆధునీకరణకు ముందు గండిపడిన సందర్భాలు ఉన్నాయి. నిడమనూరు మండలం బికే పహాడ్  సమీపంలోని వెంకన్నగూడెం మైనర్ తూము వద్ద, హాలియా మండలం  ఇబ్రహీం పేట గ్రామం వద్ద కాల్వకట్టకు గండి పడింది. అప్పుడూ వ్యవసాయ పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సాగర్ ఎడమ కాలువ ఆధునీకరణ పనులు చేపట్టిన తర్వాత గండి పడడం మాత్రం ఇదే మొదటిసారి. కట్ట బలోపేతం చేయడం వల్ల… కట్టకు ఇబ్బంది లేకున్నా యూటీలను ఆధునీకరించకపోవడం వల్లే గండి పడింది.

Follow Us:
Download App:
  • android
  • ios