తెలంగాణ లో అధికార టీఆర్ఎస్ పార్టీ నుండి తనకు ప్రాణ హాని ఉందంటూ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.తనకు ఇప్పటివరకు కేటాయించిన  1+1 భద్రతను ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో తనకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. వెంటనే తనకు ఇంతకుముందులాగే భద్రతను పునరుద్దరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని నాగం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

గతంలో పాలమూరు రంగారెడ్డి పథకంపై కోర్టులో కేసు వేశాడని నాగంపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. నాగం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలోకి చొచ్చుకువచ్చి దాడికి యత్నించారు. ఆయన ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలోని కిటికీ అద్దాలను ద్వంసం చేసి వీరంగం 
సృష్టించారు. నాగంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గందరగోళాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడి నుండి నాగం సురక్షితంగా బైటపడ్డారు.

అయితే నాగంకు ప్రభుత్వ సెక్యూరిటీ ఉన్న సమయంలోనే ఇలాంటి సంఘటన జరిగింది. అయితే అతడు కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ లో చేరి టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా, సీఎం కేసీఆర్, మంత్రులపైనా ఘాటు విమర్శలు చేస్తున్నారు. దీంతో మళ్లీ తనపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేసే అవకాశం ఉందని భావించిన నాగం తనకు రక్షణ పునరుద్దరించాలంటూ కోర్టును కోరారు. అయిే నాగం టీఆర్‌ఎస్‌ నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ దాఖలుచేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది.