పాలమూరు జిల్లాలో పట్టున్న నేతగా పేరు సంపాదించారు నాగం జనార్దన్ రెడ్డి. ఆయన టిడిపిలో సుదీర్ఘకాలం రాజకీయాలు చేశారు. తెలంగాణ కోసం పోరాడి టిడిపిని విడిచిపెట్టారు. తర్వాత నగారా సమితి పేరుతో ఒక సంస్థను స్థాపించారు. కానీ దాన్ని పార్టీగా మార్చలేకపోయారు. తర్వాత నాగం బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో మహబూబ్ నగర్ సీటులో ఎంపిగా బిజెపి తరుపున పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల తర్వాత బిజెపిలో నాగం ఇమడలేకపోయారు. ఎప్పుడెప్పుడు బిజెపిని వీడిపోవాలా అన్నట్లుగా ఉన్నారు. అనుకున్నట్లే ఆయన రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

నాగం పార్టీలో చేరకముందు పాలమూరులో కాంగ్రెస్ లో బలమైన నేతలుగా ముద్రపడిన వారంతా నాగం రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. కొందరైతే ఏకంగా అధిష్టానాన్ని తీవ్రంగా వత్తిడి పెట్టారు. అయినా అధిష్టానం నాగం రాకను వ్యతిరేకించేవారి మాటనను ఏమాత్రం పట్టించుకోలేదు. నాగం రాకను బలంగా వ్యతిరేకించిన వారిలో గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ ముందు వరుసలో ఉన్నారు. అలాగే నాగం మీద పోటీ చేసి వరుసగా ఓడిపోతూ వస్తున్న కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కూడా గట్టిగానే వ్యతిరేకిస్తూ వచ్చారు. వారి మాటలను లెక్క చేయకుండానే రాహుల్ గాంధీ సమక్షంలో నాగం ను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు.

ఇక అధిష్టానమే నిర్ణయం తీసేసుకున్న సమయంలో చేసేదేమీలేక నాగం వ్యతిరేకులు పార్టీలో మెసలలేకపోతున్నారు. నాగం చిరకాల ప్రత్యర్థిగా గుర్తింపు పొందిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఆగ్రహం ఇంకా చల్లారినట్లు లేదు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నాగం రాకతో తనకు అభ్యంరతం లేదంటూనే పెద్ద బాంబులే పేల్చారు. గతంలో తనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులే పనిచేసి నాగం ను గెలిపించారని ఆరోపించారు. పార్టీలో చేరిన తర్వాత 3ఏళ్లపాటు సేవ చేసిన వారికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాగం ను ఉద్దేశించి ఆయన ఈ డిమాండ్ ను తెరపైకి తెచ్చారు.

అంతేకాదు.. జైపాల్ రెడ్డికి, నాగం కు ఎప్పటినుంచో సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపారు. జైపాల్ రెడ్డి మీద కూడా కూచుకుళ్ల గట్టిగానే ఫైర్ అయ్యారు. జైపాల్ రెడ్డికి ఇప్పటి వరకు సొంత నియోజకవర్గం అంటూ లేకుండాపోయిందని ఎద్దేవా చేశారు. ఆయన ఎక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే అక్కడకు వెళ్ళి పోటీ చేస్తారని విమర్శించారు.

నాగం రాకను భయంకరంగా వ్యతిరేకించకపోయినా.. కూచుకుళ్ల దామోదర్ రెడ్డి లోపలా, బయటా పొగ పెట్టే విషయంలో మాత్రం రాజీ పడడంలేదన్న ప్రచారం బలంగా సాగుతోంది. కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, డికె అరుణ ఒకే వర్గంగా పాలమూరు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. దీన్నిబట్టి డికె అరుణ కూడా ఇంకా నాగం రాక విషయంలో గుర్రుగానే ఉన్నట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.