Asianet News TeluguAsianet News Telugu

‘చే’నేత బంధం.. కథ సుఖాంతం !

‘చే’నేత బంధం ‘రాజన్న’ను ‘రాము’ను ఒక్కటి చేసిందా... అత్తారింటికి రాకముందే సమంత బ్రాండ్ అంబాసిడర్ గా మారిన నేపథ్యంలో కబ్జా ఆరోపణలు ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్  కథ సుఖాంతం కాబోతుందా...?

 

 

N Convention centre  issue will die down natuarlly

హైదరాబాద్ లో అడుగు కబ్జా చేసినా అంతుచూస్తామని బెదిరించిన టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రూటు మార్చిందా...  ఉద్యమ సమయంలో కబ్జా రాయుళ్లపై గొంతుచించుకున్న పార్టీ ఇప్పుడు మౌనంగా ఉంటుందా..

 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవగానే అక్రమంగా కట్టారని మా ఇళ్లను కూల్చేసిన సర్కారు పెద్దోళ్ల కబ్జాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే సామాన్యులు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

 

గూగుల్ మ్యాప్స్ లో నీళ్లతో కళకళలాడుతున్న చెరువులు వాస్తవానికి వచ్చేసరికి కబ్జా రాయుళ్ల చేతిలో బంధిగా మారాయి. ఇలాంటి కబ్జాలపై ఉక్కు పాదం మోపాల్సిన సర్కారు తమ గూడుపైన మాత్రమే ప్రతాపం చూపుతోందని వారు విమర్శిస్తున్నారు.

 

వారి ఆరోపణల్లోనూ కాస్త నిజం లేకపోలేదు.   ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ కాకతీయ పనులు రాష్ట్రమంతా వేగంగా జరుగుతున్నాయి. ప్రతి ఊళ్లోనూ చెరువులను గుర్తించి పనులు చేపడుతున్నారు. అదేంటో కానీ, హైదరాబాద్ లో మాత్రం మిషన్ కాకతీయ కింద పనులు చేపట్టాలంటే చెరువులే కనిపించడం లేదు.

 

ఇప్పటికే చాలా చోట్ల అక్రమంగా కట్టారని పేదోళ్ల ఇళ్లను జేసీబీలతో కూల్చి వేసింది. కానీ, పెద్దోళ్ల ఆగడాలను మాత్రం లైట్ తీసుకుంది. ఎందుకు ఈ వివక్ష అనేది ఇప్పుడు పేదోడి ప్రశ్న.

 

దీనికి సమాధానం చెప్పాల్సిన సర్కారు ప్రేక్షకపాత్ర వహిస్తోందని, కబ్జా రాయుళ్లకే పెద్ద పీఠ వేసి గౌరవిస్తోందని ఆరోపణలొస్తున్నాయి.

 

ఇటీవల అసెంబ్లీ సమావేశ చర్చల్లో టీడీపీ నేత రేవంత్ రెడ్డి సినీ నటుడు నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసి దాన్ని నిర్మించారని ఆరోపించారు. (ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ నేతలు కూడా అవే ఆరోపణలు చేశారు. ) దీనిపై స్పందిచాల్సిన ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

 

ఈ నేపథ్యంలోనే ఐటీ మంత్రి కేటీఆర్ చేనేత కు చేయూత నివ్వాలని పిలుపునివ్వడం దానికి నాగార్జున స్పందించి చేనేత దుస్తులు ధరించిన ఫొటోను ట్విటర్లో పెట్టడం దానికి కేటీఆర్ అభినందించడం జరిగిపోయాయి.

 

ఇంతలోనే సినీ నటి సమంత తెలంగాణ చేనేతకు తాను బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానంటూ ముందుకు వచ్చారు. కేటీఆర్ ను కలిసి చేనేత వస్త్రాలతో ఫొటోలకు ఫోజు కూడా ఇచ్చారు. ఇటీవల సమంతకు నాగార్జున కుమారుడు నాగచైతన్యకు నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.

 

ఇలా చేనేత బంధం వల్లే ఎన్ కన్షెన్షన్ పై చర్యలు తీసుకోడానికి ప్రభుత్వం వెనకడుగు వేస్తుందా... లేకుంటే అసలు రేవంత్ రెడ్డి ఆరోపణలే నిజం కావా... ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలే చెప్పాలి.

 

Follow Us:
Download App:
  • android
  • ios