నా జీవితం తెరిచిన పుస్తకం.. దేశం కోసం ఇంటిని వదిలిపెట్టాను - మోడీ
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటే అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తోందని ప్రశ్నించారు.
తన జీవితం తెరిచిన పుస్తకతం అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తన జీవితం దేశానికే అంకితమని చెప్పారు. తన ఇంటిని వదిలిపెట్టి ఓ లక్ష్యం కోసం వచ్చానని అన్నారు. సోమవారం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొని ప్రసంగించారు.
ఆదిలాబాద్ ముద్దు బిడ్డ రామ్ జీ గోండు పేరుతో హైదరాబాద్ లో మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని తెలిపారు. అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నామని అన్నారు. ‘‘ వికసిత భారత్ కోసం మీరందరూ ఇక్కడికి రావడం సంతోషకరం. వికసిత్ భారత్ పై నిన్న మంత్రులు, అధికారులతో సుధీర్ఘంగా చర్చించాం. దేశ అభివృద్ధి కోసం రూ. వేల కోట్ల పనులను చేపట్టాం.
మోడీ గ్యారెంటీపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 15 రోజుల్లో రెండు ఐఐటీలు, ఓ ట్రిపుల్ ఐటీ, ఒక ఐఐఎస్ ను ప్రారంభించాం ’’ అని అన్నారు.
రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేసి తెలంగాణ రైతుల కల సాకారం చేస్తున్నామని ప్రధాన నరేంద్ర మోడీ అన్నారు. కుటుంబ పార్టీలను ఎప్పుడూ నమ్ముకోవదని అన్నారు. ‘‘కుటుంబ పార్టీలో రెండే అంశాలు ఉంటాయి. ఒకటి దోచుకోవడం, రెండోది అబద్దాలు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తోంది.’’ అని ప్రధాని తెలిపారు.
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని ప్రధాని మోడీ విమర్శించారు. ‘‘దేశవ్యాప్తంగా 7 టెక్స్ టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించాం. తెలంగాణలో సమక్క సారక్క యూనివర్సిటీని ప్రారంభిస్తున్నాం. తెలంగాణ ప్రజల కలల నెరవేర్చడమే లక్ష్యం.
ఈ భూమి ఎంతో పవిత్రమైనది. పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల్లో గెలిపించాలి. దేశ వ్యాప్తంగా అబ్ కీ బార్ చార్ సౌ పార్ అంటున్నారు.’’ అని ప్రధాని మోడీ అన్నారు.