ఓ కిరాణ దుకాణం నిర్వాహకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. కంట్లో కారం చల్లి.. గొంతు కత్తితో కోసి మరీ హత్య చేశారు. ఈ దారుణ సంఘటన హయత్ నగర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..  మిర్యాలగూడ గరిడెపల్లికి చెందిన బొంతు అంజన్ రెడ్డి(52) గత కొంతకాలంగా మన్సూరాబాద్ డివిజన్ లోని కొలన్ శివారెడ్డి కాలనీలో తన కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నాడు. హయత్ నగర్ మదర్ డెయిరీ సమీపంలోని ప్రియదర్శిని కాలనీ శ్రీకృష్ణ దేవాలయం వద్ద అంజన్ రెడ్డి కిరాణ షాపు నిర్వహిస్తున్నాడు.

ఇటీవల పనిమీద ఊరువెళ్లి అంజన్ రెడ్డి.. భార్య, కూతురు, కుమారుడిని మాత్రం అక్కడే వదిలేసి తాను హయత్ నగర్ వచ్చేశాడు. కాగా, గరిడెపల్లిలో ఉన్న కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం 10 గంటలకు అంజన్‌రెడ్డికి ఫోన్‌ చేయగా తీయలేదు. సాయంత్రం 4.30 గంటలకు హయత్‌నగర్‌కు భార్య శిరీష, కుమారుడు శ్రావన్‌రెడ్డి కిరాణా షాపు వద్దకు వచ్చి చూడగా షట్టర్‌ వేసి ఉంది. 

వెంటనే షట్టర్‌ తీసి చూడగా అంజన్‌రెడ్డి కిందపడి ఉన్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు అంజన్‌రెడ్డి కళ్లల్లో కారంచల్లి, గొంతును కత్తితో కోశారని కొందరు చెబుతున్నట్లు తెలిసింది. వెంటనే విషయాన్ని హయత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసి ప్రాణాపాయస్థితిలో  ఉన్న అంజన్‌రెడ్డిని ఎల్‌బీనగర్‌లోని మ్యాక్స్‌క్యూర్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఎలాంటి అలజడి లేకుండా ఈ సంఘటన ఎలా జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.