నిజామాబాద్ జిల్లా  బోధన్ లో దారుణం చోటుచేసుకుంది.  అత్తింటివారి అరాచకానికి ఓ నిండు గర్భిణి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. కట్టుకున్నవాడితో పాటు అత్త, మరిది కలిసి గర్భిణిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. అమానవీయంగా ప్రవర్తిస్తూ వారు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలితో పాటు కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు.

ఈ అఘాయిత్యానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. భోదన్ సమీపంలోని రాకాసిపేట గ్రామానికి చెందిన ప్రశాంత్ కు సీతాలుతో గతేడాది వివాహమైంది. అయితే పెళ్లయిన కొద్దిరోజులకే భర్తతో పాటు అత్తింటివారు ఆమెను  వేధించడం ప్రారంభించారు. సూటిపోటి మాటలతోనే కాదు  బౌతిక దాడులకు పాల్పడూ నరకం చూపించేవారు. అయినా ఈ బాధపలన్నింటిని ఆమె భరిస్తూ వస్తోంది. 

ఇలా వారి బాధలను భరించడానికి ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డే కారణం. గర్భం దాల్చిన ఆమె బిడ్డకు జన్మనిస్తే వదిలించుకోవడం కష్టమని భావించినట్లున్నారు  అత్తింటివారు. దీంతో ఇక కేవలం వేధించడం కాదు ఆమె అడ్డుతొలగించుకోడానికి  పథకం వేశారు. 

వారి ప్లాన్ లో భాగంగా భర్త, అత్త, మరిది కలిసి ఆమెనుమ బంధించారు. ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి అక్కడి నుండి పారిపోయారు. అయితే ఆమె కేకలు విన్న ఇంటి చుట్టుపక్కల వారు మంటలను ఆర్పి నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు.  ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు...తల్లి, బిడ్డ ఇద్దరి ప్రాణాలు కాపాడటానికి  తాము ప్రయత్నిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీతాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.