టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఇజ్జత్ తీసిన సర్పంచ్ పై వేటు

First Published 10, Apr 2018, 7:22 PM IST
munugodu trs sarpanch pandula lingaiah suspended
Highlights
నల్లగొండ హాట్ న్యూస్..

నల్లగొండ జిల్లాలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే కు సొంత పార్టీ సర్పంచ్ షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే కారుకు అడ్డంపడి కారు ముందు పడుకుని నిరసన తెలిపారు ఆ సర్పంచ్. ఎమ్మెల్యే ఇజ్జత్ ఖరాబ్ చేసిండన్న కోపంతో ఆ సర్పంచ్ పై పార్టీ నేతలు వేటు వేశారు. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అడ్డుకుని నిరసన తెలిపిన వీడియో కింద ఉంది చూడొచ్చు.

తీవ్ర సంచలనం రేపిన ఈ సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, భువనగిరి ఎంపి బూర నర్సయ్య గౌడ్ ఇద్దరూ మునుగోడులో సోమవారం పర్యటించారు. అయితే తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని మునుగోడు సర్పంచ్ పందుల నర్సింహ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే కారుకు అడ్డంపడి నిరసన తెలిపారు. కారును కదలనీయకపోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఎమ్మెల్యేను అక్కడినుంచి పంపించారు.

ఈ సందర్భంగా మునుగోడు సర్పంచ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కేవలం అగ్రవర్ణాలకే పెద్ద పీఠ వేస్తున్నారని దళిత, బడుగు, బలహీన వర్గాలపై చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. తాను దళిత సర్పంచ్ కాబట్టే అవమానిస్తున్నాడని ఆరోపించారు. సర్పంచ్ పందుల నర్సింహ్మ చేసిన ఆందోళన పార్టీ అధిష్టానం దృష్టికి పోయిందని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో పందుల నర్సింహ్మపై సస్పెన్షన్ వేటు పడింది. పందుల నర్సింహ్మను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మునుగోడు మండల పార్టీ టిఆర్ఎస్ అధ్యక్షులు బొడ్డు నర్సింహ్మ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మండల పార్టీ నేతలు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది కాలంగా సర్పంచ్ పందుల నర్సింహ్మ టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని సమావేశం అభిప్రాయపడింది. అందుకే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

అయితే ఈ సర్పంచ్ పందుల నర్సింహ్మ గతంలో టిడిపిలో పోటీ చేసి గెలుపొందారు. అయితే బంగారు తెలంగాణ కోసం ఆయన టిఆర్ఎస్ పార్టీలో చేరారు. కానీ స్థానిక ఎమ్మెల్యేకు, సర్పంచ్ కు మధ్య తీవ్రమైన వైరం ఉంది. ఈ తరుణంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళన చేసి ఆయన ఇజ్జత్ ఖరాబ్ చేసినందుకు ఆయనపై వేటు వేసినట్లు పార్టీ వర్గాల్లొ చర్చ జరుగుతున్నది.

loader