Asianet News TeluguAsianet News Telugu

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి: మునుగోడులో తీన్మార్.. ముగ్గురు నేతల మధ్య టికెట్ పోరు

మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్‌ కోసం ముగ్గురు నేతల మధ్య పోటీ నడుస్తున్నది. కాంగ్రెస్‌లో చేరబోతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉపఎన్నికలో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయిన పాల్వాయి స్రవంతి, ఈ అసెంబ్లీ ఎన్నికలకు టికెట్ హామీ పొందిన చలమల్ల కృష్ణారెడ్డి తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
 

munugode congress ticket, three leaders in contest including komatireddy rajagopalreddy kms
Author
First Published Oct 26, 2023, 6:53 PM IST

హైదరాబాద్: గతేడాది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ సభ్యత్వాన్ని వదులుకుని, ఎమ్మెల్యేగా రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లారు. తద్వార అత్యంత ఖరీదైన మునుగోడు ఉపఎన్నిక జరిగింది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ శక్తియుక్తులను ఒడ్డి పోరాడింది. సుమారు పదివేల ఓట్ల తేడాతో రాజగోపాల్ రెడ్డి ఓడిపోయారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తున్నారు. మునుగోడు నుంచే కాదు.. అధిష్టానం ఆదేశిస్తే సీఎం కేసీఆర్ పై గజ్వేల్‌లోనూ పోటీ చేయడానికి సిద్ధం అంటున్నారు. గజ్వేల్ సంగతేమో కానీ, మునుగోడు టికెట్టే అంత సులువుగా తేలేలా లేదు. ఎందుకంటే మునుగోడు టికెట్ కోసం మొన్నటి వరకు పాల్వాయి స్రవంతి, చలమల్ల కృష్ణారెడ్డి పోటీ పడితే.. ఇప్పుడు సీనియర్ లీడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా చేరారు.

రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లాక వచ్చిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ టికెట్ కోసమూ పాల్వాయి స్రవంతి, చలమల్ల కృష్ణారెడ్డి పోటీ పడ్డారు. ఉపఎన్నికకు స్రవంతికి ఛాన్స్ ఇవ్వాలని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చలమల్లకు అవకాశం ఇస్తామని అప్పుడు కాంగ్రెస్ బుజ్జగించింది. ఈ సారి మునుగోడు టికెట్ తనకేనని చలమల్ల స్పష్టం చేస్తున్నారు.

రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లోకి రావడంపై చలమల్ల స్పందిస్తూ.. ఆయన తిరిగి రావడం శుభసూచకం అని, కోమటిరెడ్డి సహకారం, సీపీఐ, సీపీఎం మద్దతుతో తానే మునుగోడులో పోటీలో ఉంటానని చెప్పారు. మునుగోడు ఉపఎన్నిక తర్వాత ఈ ఎన్నికల్లో టికెట్ తనకే ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టమైన హామీ ఇచ్చిందని తెలిపారు. కాబట్టి, కార్యకర్తలు ఆందోళన చెందరాదని, తానే బరిలో ఉంటానని వివరించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర స్థాయి నాయకుడని, ఆయన రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చలమల్ల తెలిపారు. పార్టీ మారి వచ్చిన వారికి టికెట్ ఇస్తే క్యాడర్ ఆగ్రహాన్ని చవిచూడాల్సిందేనని సుతిమెత్తగా వార్నింగ్ కూడా ఇచ్చారు.

Also Read: Bandi Sanjay: బీజేపీపై బండి సంజయ్ అసంతృప్తి.. ‘నా ఇమేజ్ దెబ్బతీయడానికే కరీంనగర్ టికెట్’

కాగా, మళ్లీ తనకే టికెట్ ఇవ్వాలని పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, రాజగోపాల్ రెడ్డి మునుగోడు టికెట్ తనకే ఫిక్స్ అన్నట్టుగా ఉన్నారు. మునుగోడు టికెట్, గజ్వేల్ నుంచీ పోటీపై ఆయన ఇది వరకే కేసీ వేణుగోపాల్‌తో సమావేశం కావడం గమనార్హం.

దీంతో రాజగోపాల్ రెడ్డికే మునుగోడు టికెట్ దక్కుతుందా? అనే చర్చ జరుగుతున్నది. ఒక వేళ అదే జరిగితే స్రవంతి, కృష్ణారెడ్డికి సర్దిచెప్పుతుందా? మరేదైనా నామినేటెడ్ పదవులు ఇచ్చే హామీ ఇస్తుందా? అనే విషయంపై ఉత్కంఠ నెలకొని ఉన్నది. ఈ ముగ్గురిలో ఎవరికి టికెట్ దక్కనుందనే విషయం తెలుసుకోవడానికి కాంగ్రెస్ జాబితా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: అసెంబ్లీ వద్దు, పార్లమెంటే ముద్దు!.. తెలంగాణ బీజేపీ సీనియర్ల తీరు.. ఎందుకంటే?

మునుగోడులో వామపక్ష, కాంగ్రెస్ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. ఉపఎన్నికలోనూ వామపక్షాల మద్దతు వల్లే బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ గెలిచి ఎమ్మెల్యే అయ్యారనేది విశ్లేషకుల మాట. అయితే, ఈ సారి వామపక్షాలు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థికి గెలిచే అవకాశాలు ఎక్కువ అని అర్థం అవుతున్నది. దీంతో మునుగోడు టికెట్‌కు డిమాండ్ పెరగడం సహజం.

Follow Us:
Download App:
  • android
  • ios