Asianet News TeluguAsianet News Telugu

మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్.. పూర్తి వివరాలు ఇవే..

మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. 

Munugode Bypoll Schedule released Polling on 3rd november
Author
First Published Oct 3, 2022, 12:10 PM IST

మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ మేరకు నేడు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. మునుగోడుతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని మరో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. 

ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం..  ఈనెల 7న మునుగోడు ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల సమర్పణకు ఈనెల 14వరకు తుది గడవుగా నిర్ణయించారు. ఈ నెల 15న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 17 వరకు అవకాశం కల్పించారు. ఇక, నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 6వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. మునుగోడు ఉప ఎన్నిక ప్రక్రియ నవంబర్ 8తో ముగియనుంది. 

 

ఇక, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అయితే ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలకు ముందే.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు మునుగోడులో గెలుపే లక్ష్యంగా ప్రణాళికులు రచించాయి. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఖరారు చేశాయి. బీజేపీ తమ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బరిలో దింపనుంది. అయితే టీఆర్ఎస్ మాత్రం తమ పార్టీ అభ్యర్థి ఎవరనేది అధికారికంగా ప్రకటించలేదు. అయితే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని టీఆర్‌ఎస్ నుంచి బరిలో నిలిపే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.  

ఇదిలా ఉంటే.. ఇప్పటికే అన్ని పార్టీలు మునుగోడులో తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. సీఎం కేసీఆర్ మునుగోడులో ఇదివరకే బహిరంగ సభ నిర్వహించగా.. మరో సభకు కూడా హాజరవుతారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు క్షేత్ర స్థాయిలో కూడా ఆ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక, బీజేపీ కూడా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మునుగోడులో బహిరంగ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే కొద్ది రోజులుగా మునుగోడు ఉపఎన్నికపై ఏర్పాటైన బీజేపీ స్టీరింగ్ కమిటీ వరసుగా సమావేశాలు నిర్వహిస్తూ.. ప్రచారాన్ని ఉధృతం చేసేలా ప్రణాళికలు రచిస్తుంది. 

కాంగ్రెస్ విషయానికి వస్తే.. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా పదిలంగా ఉంచుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి.. క్షేత్ర స్థాయిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆ పార్టీ నేతలు కూడా నియోజకవర్గంలో పలు సమావేశాలను ఏర్పాటు చేసి.. ప్రచారంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే.  

 

Follow Us:
Download App:
  • android
  • ios