- Home
- Telangana
- చైనా మంజాను ఎలా తయారు చేస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ప్రాణాలు పోయేంత ప్రమాదం ఎందుకు.?
చైనా మంజాను ఎలా తయారు చేస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ప్రాణాలు పోయేంత ప్రమాదం ఎందుకు.?
China Manja: సంతోషంగా జరుపుకోవాల్సిన సంక్రాంతి పండుగ ఒక చిన్న తప్పుతో విషాధాన్ని నింపుతోంది. గాలి పటాలకు ఉపయోగించే చైనా మంజా మనుషుల ప్రాణాలను తీస్తోంది. తాజాగా సంగారెడ్డిలో జరిగిన ఓ సంఘటన పండగపూట విషాన్ని నింపింది.

ప్రాణం బలితీసుకున్న చైనా మాంజా
సంక్రాంతి పండుగ వేళ పతంగుల సరదా ప్రాణాంతకంగా మారుతోంది. చైనా మాంజా దారాలు గాల్లో తేలుతూ వాహనదారుల మెడల దగ్గరికి వచ్చి ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా ఫసల్వాది వద్ద జరిగిన ఘటన అందరినీ కలచివేసింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి మెడకు చైనా మాంజా చుట్టుకొని తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయాడు.
క్షణాల్లో మృత్యువు
ఫసల్వాది గ్రామం వద్ద బైక్‌పై వెళ్తున్న అద్వైక్ అనే వ్యక్తి మెడ వద్దకు గాల్లో తేలుతున్న మాంజా దారం తగిలింది. వేగంగా వెళ్తున్న కారణంగా దారం గొంతు కోసింది. తీవ్ర గాయంతో భారీగా రక్తస్రావం జరిగింది. ఆసుపత్రికి తరలించేలోపే మార్గమధ్యలో మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. బీహార్‌కు చెందిన అద్వైక్ ఫసల్వాది ప్రాంతంలో పరిశ్రమలో పని చేస్తున్నాడు.
అసలు చైనా మాంజా అంటే ఏంటి? ఎలా తయారు చేస్తారు?
చైనా మాంజా సాధారణ పత్తి దారం కాదు. దీనిని తయారు చేసే విధానం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఇందుకోసం ముందుగా నైలాన్ దారం తీసుకుంటారు. అనంతరం గాజు ముక్కలు సన్నగా పొడిచేస్తారు. వాటిని రసాయన గ్లూ తో దారానికి అంటిస్తారు. కొన్నిసార్లు లోహ పొడులు కలుపుతారు. ఈ ప్రక్రియ వల్ల దారం కత్తిలా మారుతుంది. గాల్లో కనిపించకుండా తేలుతూ ఎదురుగా వచ్చే వ్యక్తి మెడ, చేతులు, కాళ్లను కోసేస్తుంది.
ఎందుకు ఇంత ప్రమాదకరం?
చైనా మాంజా ప్రమాదకరంగా మారడానికి కారణాలు స్పష్టంగా ఉన్నాయి. గాల్లో కనిపించదు, వేగంగా వెళ్తున్న వాహనదారులకు తప్పించుకునే అవకాశం ఉండదు, మెడ, రక్తనాళాల వద్ద తగిలితే క్షణాల్లో ప్రాణహాని సంభవిస్తుంది. పక్షులు భారీ సంఖ్యలో మరణిస్తాయి. పిల్లలు, వృద్ధులు తీవ్రంగా గాయపడుతున్నారు.
నిషేధం ఉన్నా మార్పు ఎందుకు రావడం లేదు?
చైనా మాంజా వాడకం నిషేధితమే. పోలీసులు షాపులపై దాడులు చేస్తున్నారు. కేసులు నమోదు చేస్తున్నారు. అయినా కొందరు నిర్లక్ష్యంగా వాడుతూనే ఉన్నారు. పండుగ సరదా కోసం ప్రాణాలతో చెలగాటం ఆడటం ఎంత వరకు న్యాయం అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి చైనా మాంజా ఉపయోగాన్ని తగ్గించేలా తల్లిదండ్రులు పిల్లన్ని కట్టడి చేయాలని సూచిస్తున్నారు. అదే విధంగా వాహనాలపై వెళ్లే వారు కూడా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

