Asianet News TeluguAsianet News Telugu

Munugode bypoll 2022: కెసిఆర్ పక్కా వ్యూహం, నేతలతో వరుస భేటీలు

మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై కెసిఆర్ టిఆర్ఎస్ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ద్వారా ఈ ఉప ఎన్నిక రానుంది.

Munugode bypoll: KCR to chalk out TRS strategy, meeting with leaders
Author
Hyderabad, First Published Aug 6, 2022, 8:33 AM IST

హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించాలనే పట్టుదలతో తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు ఉన్నారు. బిజెపి తెలంగాణలో పాగా వేసే ఆలోచనతో వ్యూహాత్మకంగా సాధారణ ఎన్నికలకు ముందు మునుగోడు ఉప ఎన్నికను ఆహ్వానిస్తోంది. హుజూరాబాద్ ఫలితాన్ని రిపీట్ చేయాలని అనుకుంటోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నారు. దీంతో మునుగోడుకు ఉప ఎన్నిక వస్తోంది. బిజెపికి కళ్లెం వేయాలంటే మునుగోడులో తప్పనిసరిగా టిఆర్ఎస్ ఆ సీటును కైవసం చేసుకునేలా వ్యూహాలు రచించి అమలు చేయాలని కెసిఆర్ ఆలోచిస్తున్నారు.

ఇప్పటికే మునుగోడు పరిస్థితిపై ప్రశాంత్ కిశోర్ కు చెందిన ఐప్యాక్, ఇతర సర్వే సంస్థలు, ప్రభుత్వ నిఘా విభాగం కెసిఆర్ కు నివేదికలు సమర్పించాయని అంటున్నారు. ఆ నివేదికలను కెసిఆర్ అధ్యయనం చేశారని చెబుతున్నారు. మునుగోడు సీటును టిఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆశిస్తున్నారు. వారిద్దరు ఇప్పటికే కెసిఆర్ ను కలిశారు. మునుగోడులో టిఆర్ఎస్ బలబలాలపై అధ్యయనం చేసిన ఆయన శుక్రవారంనాడు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో సమావేశమయ్యారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డి, ఇతర పార్టీ నాయకులతో కెసిఆర్ వరుసగా భేటీ అవుతున్నారు. శుక్రవారం జరిగిన భేటీలో టిఆర్ఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంచార్జీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, నల్లగొండ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు డి. రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. రెండు విడతలుగా ఆరు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి క్షేత్ర స్థాయిలో సేకరించాల్సిన సమాచారంపై, అనుసరించాల్సిన వ్యూహంపై కెసిఆర్ దిశానిర్దేశం చేశారు. 

హుజూర్ నగర్, నాగార్జునసాగర్, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలపై, వచ్చిన ఫలితాలను ప్రస్తావిస్తూ మునుగోడులో అనుసరించాలనే విషయంపై సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఉన్న బలంపై కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఆయన వెంట బిజెపిలోకి వెళ్లే స్థానిక నాయకులు ఎవరనే విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. 

ఈ నెల 21వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సందర్భంగా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. మునుగోడు స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా పార్టీకి ఊపు తేవాలనే ఆలోచనతో బిజెపి అగ్రనేతలున్నారు. పార్టీకి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఓ సమావేశం నిర్వహించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios