Asianet News TeluguAsianet News Telugu

మునుగోడు బై పోల్.. కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయిన పాల్వాయి స్రవంతి.. కాంగ్రెస్‌కు షాకిచ్చేలా ఫలితం..?

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ నల్గొండ జిల్లా అర్జాలబావిలోని వేర్ హౌసింగ్ గోడౌన్స్​లో కొనసాగుతుంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం మునుగోడులో టీఆర్ఎస్,‌బీజేపీల మధ్య హోరా హోరీ పోరు కొనసాగుతుంది.

munugode bypoll Counting Updates congress Candidate palvai sravanthi walks out from counting centre
Author
First Published Nov 6, 2022, 10:17 AM IST

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ నల్గొండ జిల్లా అర్జాలబావిలోని వేర్ హౌసింగ్ గోడౌన్స్​లో కొనసాగుతుంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం మునుగోడులో టీఆర్ఎస్,‌బీజేపీల మధ్య హోరా హోరీ పోరు కొనసాగుతుంది. కాంగ్రెస్ మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేకపోయిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన పాల్వాయి స్రవంతి తీవ్ర నిరాశ చెందినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే  ఆమె కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. 

ఇక, ఈ రోజు ఉదయం కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న సమయంలో పాల్వాయి స్రవంతి రెడ్డి మాట్లాడుతూ.. విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సక్సెస్ అవుతాయని లేదుగా ప్రశ్నించారు. అయితే ఇప్పటివరకు వెలువడిన ప్రతి రౌండ్‌లో కాంగ్రెస్‌ మూడో స్థానానికి పరిమితం కావడం.. బీజేపీ, టీఆర్ఎస్‌‌లతో పోలిస్తే చాలా తక్కువ సంఖ్యలో ఓట్లు పోలు కావడంతో పాల్వాయి స్రవంతి నిరాశతో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. 

అయితే మునుగోడు ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కూడా సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని ముందు నుంచే ప్రయత్నాలు చేపట్టింది. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలకు ముందే పాల్వాయి స్రవంతిని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ప్రచారంలో విషయంలో మాత్రం ఆ పార్టీ వెనకబడిందనే చెప్పాలి. మరోవైపు టీఆర్ఎస్, బీజేపీల మాదిరిగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు ప్రచారం నిర్వహించలేదనే టాక్ కూడా ఉంది. అలాగే ఓటర్లను ప్రలోభ  పెట్టడంలో కూడా కాంగ్రెస్ వెనకబడిందని చాలా మంది మునుగోడు వాసులే స్వయంగా వెల్లడించారు. 

మరోవైపు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. హస్తం పార్టీ నాయకులను తన వైపుకు తిప్పుకున్నారని ఎర్లీ ట్రెండ్స్ ద్వారా స్పష్టమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాల్వాయి స్రవంతికి పడిన ఓట్లు కూడా ఆమె తండ్రి పాల్వాయి గోవర్దన్ రెడ్డికి ఉన్న ఆదరణ, కరుడుగట్టిన కాంగ్రెస్ వాదుల నుంచి మాత్రమే వచ్చాయనే టాక్ వినిపిస్తోంది. మునుగోడులో తమ పార్టీ గట్టి ఓటు బ్యాంకును కలిగి ఉందని భావించిన కాంగ్రెస్ నాయకులకు ఈ ఫలితాల ట్రెండ్ భారీ షాక్ అనే చెప్పాలి.  

ఇక, మునుగోడు ఉప ఎన్నిక తుది ఫలితం మధ్యాహ్నాం ఒంటిగంట కల్లా వచ్చే అవకాశముంది. తొలుత చౌటుప్పల్ మండల ఓట్లను లెక్కించారు. తర్వాత నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడెం, నాంపల్లి, గట్టుప్పుల్​ మండలాల ఓట్లను లెక్కిస్తారు.

మునుగోడు ఉపఎన్నికలో రికార్డు స్థాయిలో 93.13 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 2,41,805 మంది ఓటర్లలో 2,25,192 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఈసీ అదికారులు తెలిపారు. ఇక, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడులో 91.31 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 2,41,805 మంది ఓటర్లలో 2,25,192 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇక్కడ 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 91.31 శాతం పోలింగ్ నమోదైంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios