Asianet News TeluguAsianet News Telugu

మాంసం ముక్క, మందు సుక్క, నోట్ల కట్ట.. మునుగోడు విజేతను నిర్ణయించేవి ఇవే!.. ఏషియానెట్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్..

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. నవంబర్ 3వ తేదీన అభ్యర్థుల భవిత్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. తెలంగాణ ప్రజానీకంలో కూడా మునుగోడు ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే మునుగోడులో నెలకొన్న పరిస్థితులపై ఏషియానెట్ న్యూస్  గ్రౌండ్ రిపోర్టు‌‌ను అందిస్తుంది. 

Munugode Bypoll All Set For Polling Here is the Asianet News Ground Report
Author
First Published Nov 1, 2022, 2:07 PM IST

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. నవంబర్ 3వ తేదీన అభ్యర్థుల భవిత్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. తెలంగాణ ప్రజానీకంలో కూడా మునుగోడు ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారనే ఉత్కంఠ నెలకొంది. దీంతో చాలా రోజులుగా మునుగోడులో ఏం జరగుతుందో తెలుసుకోవడానికి సామాన్య ప్రజలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే మునుగోడులో నెలకొన్న పరిస్థితులపై ఏషియానెట్ న్యూస్  గ్రౌండ్ రిపోర్టు‌‌ను అందిస్తుంది. మునుగోడు ఉపఎన్నిక విజేతను నిర్ణయించడంలో మాంసం ముక్క, మందు సుక్క, నోట్ల కట్టలు..  కీలకంగా మారే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. 

మునుగోడులో ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడిననాటి నుంచి అక్కడ మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. అలాగే ప్రచారానికి వెళ్తే కొన్ని పార్టీలు రోజుకు రూ. 500 ఆఫర్ చేస్తున్నాయని స్థానికులే స్వయంగా చెబుతున్నారు. మీటింగ్ అయిపోయాక బిర్యానీ, మందు కూడా పంపిణీ చేస్తున్నారని అంటున్నారు. నోటిఫికేషన్ వెలువడిననాటి నుంచి చాలా చోట్ల ప్రతి ఆదివారం ఓటర్ల ఇంటికి మాంసం పంపిణీ చేయడం కనిపిస్తోంది. 

అయితే ఓటర్లు కూడా తమ వద్దకు వచ్చే ఏ పార్టీని దూరం పెట్టడం లేదు. ఏ పార్టీ ఏం ఆఫర్ చేసిన స్వీకరించేందుకు వెనకాడటం లేదు. అలా తీసుకోకకపోతే.. తాము అవతలి పార్టీ వాళ్లమని అనుకునే ప్రమాదం ఉందని కొందరు ఓటర్లు చెప్పారు. అందుకే పార్టీలు కూడా ఓటర్లందరికీ పంపకాలు చేపడుతున్నాయి. ఇందులో కొన్ని పార్టీలు పోటాపోటీగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నాయి. పక్క పార్టీ పంపకాలు చేసిన చోట కూడా వెనక్కి తగ్గకుండా నగదు పంపకాలు సాగిస్తున్నారు. అయితే ఈ పంపకాలన్నీ అనధికారికంగా అభ్యర్థుల తరఫున బయటి వ్యక్తలే నిర్వహిస్తున్నారు. 

ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన నాటి  నుంచే.. ప్రధాన పార్టీలకు చెందిన పెద్ద పెద్ద లీడర్లు నియోజకవర్గంలో మకాం వేశారు. దీంతో స్థానిక ఉండే పలువురు కూడా ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. పలువురు రాజకీయ నాయకులు నెల రోజులు ఉండేందుకు కొన్ని ఇళ్లను అద్దెకు తీసుకుని భారీగా చెల్లింపులు చేపట్టారు. మరోవైపు నియోజకర్గంలో కొత్త హోటల్స్, బిర్యానీ పాయింట్స్ పుట్టుకొచ్చాయి. మాంసం మాములు రోజుల్లో లోకల్‌గా, నల్గొండ, నార్కెట్ పల్లి, చౌటుప్పల్ నుంచి వచ్చేవి.. కానీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ మొత్తం సరిపోక సూర్యాపేట నుండి సైతం ఆర్డర్ చేస్తున్నారు. 

మునుగోడులో పరిస్థితును పరిశీలిస్తే.. తెలంగాణ చరిత్రలోనే ఖరీదైన ఎలక్షన్ అని చెప్పక తప్పదు. తంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో.. ఏపీలో ఖరీదైన ఎన్నికలు నడిచేవి.. కానీ తెలంగాణాలో మాత్రం అంత సీన్ లేదనే వాదన ఉండేది. ఇప్పుడు తెలంగాణలో సైతం మునుగోడు ఉప ఎన్నిక వాటికి ఏ మాత్రం తీసిపోదని నిరూపించేలా ఉందని ఇక్కడి పరిణామాలను పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు ఏషియానెట్ న్యూస్‌కు తెలియజేశారు. 

బ్యాంకుల మందు కనిపించని జనం..
నియోజకవర్గంలోని గ్రామీణ బ్యాంకుల వద్ద ఎప్పుడూ చూసిన రద్దీ కనిపిస్తూ ఉంటుంది. ఆదివారం సెలవు దినం తరువాత సాధారణంగా గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు రష్ తో ఉక్కిరిబిక్కిరి అవుతారు. అలాంటిది సోమవారం (అక్టోబర్ 31) బ్యాంకు ఉద్యోగులకు పెద్దగా పని లేకుండా పోయింది. దీంతో ఖాళీగా కూర్చొని ఉండిపోయారు. అయితే.. ఓటర్లు అందరూ అభ్యర్థుల ప్రచారాన్ని క్యాష్ చేసుకునే పనిలో నిమగ్నమై ఉండటమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. పొద్దున ఒక పార్టీ, మధ్యాహ్నం ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ... కనీసం రెండు ర్యాలీ లకు అటెండ్ అయినా 1000 రూపాయలు, బిర్యానీ, మందు దొరుకుతుందని చాలా మంది ఓటర్లు భావిస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. పార్టీలు కూడా ఓటర్‌కి ఎంత పంచాలి అనేదానిపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదనే చెప్పాలి. ఎన్నికలకు ఒక రోజు ముందే లక్ష్మి దేవిని పంచి ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటున్నారు. పక్క పార్టీ వారు ఎంత పంచుతున్నారో చూసి దాని కన్నా ఎక్కువగా పంచుదామనే ఆలోచనలోనే టీఆర్ఎస్, బీజేపీలు వెయిట్ చేస్తున్నాయి.

అభ్యర్థులు విషయానికి వస్తే..  మునుగోడు స్థానం కాంగ్రెస్ సీటుగా కనిపించినప్పటికీ.. రెడ్డి డామినేట్ సీటు అని చెప్పాలి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పర్సనల్‌గా మంచి పేరు ఉంది. కరోనా సమయంలో రాజగోపాల్ రెడ్డి సొంత డబ్బుతో సరుకులు పంచడం మొదలైనవి చేయడాన్ని ఆయన మద్దతుదారులు ప్రధానంగా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఆపద వస్తే ఆదుకుంటాడు అనే పేరు కూడా ఉండం ఆయన కలిసివచ్చే అంశం అని చెబుతున్న ఆయన మద్దతుదారులు.. విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. రెడ్డిలలో బలమైన వర్గమైన మోటాటి రెడ్లు రాజగోపాల్ రెడ్డి కి మద్దతిస్తున్నారు. వీరు ఒకింత దళితుల ఓట్లను ప్రభావితం చేయగలరు. అయితే రాజగోపాల్ రెడ్డికి గుర్తు భయం పట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. 50 ఏళ్లు పైబడినవారు రాజ్‌గోపాల్ రెడ్డిది ఇంకా చేయి గుర్తు అనే భావనలోనే ఉన్నారు. బీజేపీ కమలం పువ్వుతో ప్రచారం చేస్తున్నప్పటికీ.. ఈ విషయంలో ఒకింత ప్రమాదం లేకపోదని మాట వినిపిస్తోంది. 


టీఆర్ఎస్ అభ్యర్థికి అందుబాటులో ఉండడు అనే అపవాదు ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ ప్రచారం మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రచారంలో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. సంక్షేమ పథకాలు టీఆర్‌ఎస్ కొండంత బలంగా కనబడుతున్నాయి. సంక్షేమ లబ్ధిదారులు ముఖ్యంగా పెన్షన్ దారులు (వితంతు, వృద్ధాప్య...) తెరాస వైపు అధికంగా మొగ్గు చూపుతున్నట్టుగా  కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కలకలం రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల వ్యవహారం అంత పెద్దగా మునుగోడు ఉపఎన్నికపై ప్రభావం చూపించడం లేదనే చెప్పాలి. కొందరైతే కేసీఆర్ గతంలో చేసింది ఏమిటి అని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. 

మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్‌‌కు వెలువడక ముందే.. అభ్యర్థిని ప్రకటించి తాము పోటీకి పూర్తిగా సిద్దంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ సంకేతాలు పంపింది. అయితే నోటిఫికేషన్ వెలువడిన నాటికి కాంగ్రెస్‌లో జోష్ తగ్గింది. కాంగ్రెస్ అభ్యర్థి తరఫున డబ్బు ప్రవాహాం పెద్దగా కనిపించడం లేదు. ఈ విషయంలో ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మహిళ ఓట్లు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఒకింత టీఆర్ఎస్‌ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏది ఏమైనా కాంగ్రెస్‌ పోటీలో వెనుకడి ఉందని క్షేత్ర స్థాయిలో పరిస్థితులను బట్టి తెలుస్తోంది. ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిస్తేజంగా మాట్లాడం కూడా ఆ పార్టీ నియోజకవర్గంలో ఎంత వీక్‌గా ఉందో తెలియజేస్తుందని ఆ పార్టీ నేతల్లోనే చర్చ సాగుతుంది. 

ప్రస్తుతం మునుగోడులో సీఆర్‌ఫీఎఫ్ బలగాలను ఈసీ రంగంలో దించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్‌లు అధికార దున్వియోగానికి పాల్పడుతున్నాయని, మునుగోడు ఉపఎన్నికను డబ్బు మయంగా మర్చేశాయని కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. 

ఇక్కడ ఆసక్తికర అంశం ఏమిటంటే... ఏజ్, జెండర్, యువత, పెన్షన్ దారులు, చిన్న పార్టీలు, బీఎస్పీ చీల్చే ఓట్లు కీలకం కానున్నాయి. ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి. మునుగోడులో క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి.. విజయం సాధించే అభ్యర్థి మెజారిటీ 5వేల ఓట్లకు మించి ఉండదని కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఓటు కీలకం కానుంది. ఈ క్రమంలోనే ప్రవీణ్ కుమార్ ఎవరి ఓట్లను చీల్చుతారనేది ఆసక్తికరంగా మారింది. 

టీఆర్ఎస్‌పై యువతలో వ్యతిరేకత కనిపిస్తోంది. అయితే వీరంతా బీజేపీ వైపు మొగ్గు చూపుతారనే తొలుత భావించినప్పటికీ.. బీఎస్పీ  ప్రవీణ్ కుమార్ ప్రచారంతో పెద్దమొత్తంలో అటువైపు మళ్లుతున్నారనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది బీజేపీకి నష్టం కలిగించే అంశమనే టాక్ కూడా నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న నేతల్లోనే వినిపిస్తోంది. అలాగే గురుకుల్లాలో చదువుకున్న వారు.. ‘‘ప్రవీణ్ కుమార్ సార్ వెంటే మేము’’ అని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యుల ఓట్లు కూడా కీలకం  కానున్నాయి. 

అయితే యువత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ వైపు మళ్లుతున్నప్పటికీ.. సంక్షేమ పథకాలు పొందుతున్న పెద్ద వయసువారి ఓట్లను ఆర్ఎస్‌ ప్రవీణ్ కుమార్ ఏ మేరకు ఆకర్షిస్తారనేది కీలంగా మారే అవకాశం ఉంది. వారిలో కొంత శాతం మేర ఓటర్ల మద్దతు కూడగట్టుకున్న అది టీఆర్ఎస్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు లెఫ్ట్ పార్టీలు టీఆర్ఎస్‌కు మద్దుతుగా నిలిచాయి. సాధారణంగా లెఫ్ట్ పార్టీలతో పొత్తులో ఉంటే.. ఆ పార్టీ మద్దతుదారుల ఓట్లు గంపగుత్తగా ఖాతాలో వేసుకునే అవకాశం ఉంటుందనే వాదన ఉంది. కానీ మునుగోడులో మాత్రం లెఫ్ట్ పార్టీల ఓటర్లు మొత్తంగా టీఆర్ఎస్ వైపు చూడటం లేదని.. ఆ ఓట్లలో కూడా చీలక వస్తుందని క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. దీంతో మునుగోడు అభ్యర్థి విజయంలో ఆర్ఎస్‌ ప్రవీణ్ కుమార్ ఓటు బ్యాంక్‌తో పాటు, లెఫ్ట్ పార్టీలు కూడా కీలక భూమిక పోషించే అవకాశం ఉంది. 

ఇక, యాదవ్, గౌడ, పద్మశాలీలలో బీజేపీ పట్ల ఒకింత మొగ్గు కనబడుతుంది. ముదిరాజ్ ఓట్లు చీలే అవకాశం కనిపిస్తోంది. గొల్ల కుర్మాలు టీఆర్ఎస్ వెంటే ఉన్నట్టుగా కనిపిస్తోంది. మిగిలిన సామాజాకి వర్గాల్లో ఓట్లలో కూడా పార్టీల వారీగా చీలక కనిపిస్తుంది. 

ఈ అన్ని పరిస్థితుల దృష్ట్యా జనాలతో మాట్లాడినప్పుడు.. ఈ రెండు రోజుల్లో ఎవరైతే లక్ష్మీని ఓటర్లకు అధికంగా అందిస్తారో వారినే విజయ లక్ష్మీ వరించనుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు అధికంగా పంచడమే కాకుండా.. అలాగే డబ్బులు పంచకుండా అవతలి పార్టీని అడ్డుకోగలిగిన పార్టీ దే విజయమనే మాట వినిపిస్తోంది. 


(- గోపగాని శ్రీహర్ష)

Follow Us:
Download App:
  • android
  • ios