మునుగోడు బైపోల్ 2022:చల్మెడ వద్ద కారులో రూ.కోటి స్వాధీనం
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చల్మెడలో సోమవారం నాడు కోటిరూపాయాల నగదును పోలీసులు సీజ్ చేశారు.కారులో ఈ నగదును తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
మునుగోడు:మునుగోడుఅసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చల్మెడ గ్రామం వద్ద కారులో కోటి రూపాయాలను సోమవారంనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును ఎక్కడికి తరలిస్తున్నారనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. విజయవాడ నుండి కారులో ఈ నగదును తరలిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు.
విజయవాడ నుండి నగదును తీసుకువచ్చిన వారికి కరీంనగర్ జిల్లాతో కూడా సంబంధాలున్నట్టుగా పోలీసులు గుర్తించారు.మునుగోడులో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.దీంతో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల కోడ్ కారణంగా రూ.50 వేల కంటే ఎక్కువ నగదును తీసుకెళ్లకూడదు. అయితే కోటి రూపాయాల నగదును కారులో తరలిస్తుండడంతో ఈ నగదును సీజ్ చేసి మునుగోడు పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.
ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకుగాను భారీగా నగదు పంపిణీ చేస్తున్నారని రాజకీయ పార్టీలపై ఆరోపణలున్నాయి. ఈ నియోజకవర్గంలోని మండల స్థాయి నేతలను తమ వైపునకు తిప్పుకొనేందుకు పార్టీలు రాజకీయ పార్టీలు భారీగా డబ్బులను ఖర్చు చేస్తున్నాయనే ఆరోపణలు లేకపోలేదు.
మునుగోడు ఉప ఎన్నికల్లో కొన్ని పార్టీలు భారీగా డబ్బులు ఖర్చుచేస్తున్నాయనే ప్రచారం కూడ సాగుతుంది. ఈ తరుణంలో డబ్బులు పట్టుబట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల 3న ఉప ఎన్నిక జరగనుంది.ఇవాళే నామినేషన్ల ఉపసంహరణకు తెరపడింది. ఈ సమయంలో చల్మెడ వద్ద కోటి రూపాయాలు దొరకడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ నెల 7వ తేదీన గూడపూర్ వద్ద కారులో రూ. 79 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. నర్సింహ్మ అనే వ్యక్తి హైద్రాబాద్ లో ఫ్లాట్ ను విక్రయించగా వచ్చిన డబ్బుగా పోలీసులకు చెప్పారు. దసరా ను పురస్కరించుకొని తన స్వగ్రామానికి వచ్చిన సమయంలో ఈ డబ్బులను ఆయన తీసుకువచ్చాడు.హైద్రాబాద్ కు తిరిగి వెళ్తున్న సమయంలో పోలీసులు ఈ నగదును సీజ్ చేశారు.
also read:బూర నర్సయ్య గౌడ్ ఇంటికి బండి సంజయ్: ఈ నెల 20 నుండి మునుగోడులో బూర ప్రచారం
ఇదిలా ఉంటే హైద్రాబాద్ నగరంలో గత వారం రోజుల క్రితం నాలుగు రోజుల వ్యవధిలో రూ.10 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు.హవాలా రూపంలో నగదును తరలిస్తున్న సమయంలో పోలీసులు సీజ్ చేశారు.