Asianet News TeluguAsianet News Telugu

బూర నర్సయ్య గౌడ్ ఇంటికి బండి సంజయ్: ఈ నెల 20 నుండి మునుగోడులో బూర ప్రచారం

భువనగిరి  మాజీ  ఎంపీ  బూర నర్సయ్య గౌడ్  ఈ  నెల 20వ తేదీ నుండి మునుగోడులో ఎన్నికల  ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల19న బూర నర్సయ్య గౌడ్  బీజేపీ  తీర్ధం  పుచ్చుకోనున్నారు.

 Bandi sanjay  invites Boora  Narasaiah Goud to join   in  BJP
Author
First Published Oct 17, 2022, 2:43 PM IST

హైదరాబాద్:టీఆర్ఎస్ కు రాజీనామా  చేసిన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఈ నెల19న బీజేపీలో  చేరనున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి  సంజయ్  సోమవారం నాడు  బూర నర్సయ్య గౌడ్ ఇంటికి వెళ్లారు. బీజేపీలో  చేరాలని బూర నర్సయ్య గౌడ్  ను బండి సంజయ్  ఆహ్వానించారు. ఇటీవలనే టీఆర్ఎస్ కు బూర నర్సయ్య  గౌడ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఈ నెల 19 న బీజేపీలో   చేరాలని బూర నర్సయ్య గౌడ్  నిర్ణయం తీసుకున్నారు.ఈ నెల 20వ తేదీ నుండి బూర నర్సయ్య  గౌడ్ మునుగోడు అసెంబ్లీ  నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు.ఈ నెల 28వ తేదీన మునుగోడు అసెంబ్లీ  నియోజకవర్గంలో  బీసీ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించనుంది బీజేపీ. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీ  ఓటర్లు గణనీయంగా  ఉన్నారు. దీంతో బీసీ ఓటర్లను ఆకట్టుకొనేందుకు బీజేపీ  ఆత్మీయ  సమ్మేళనం  నిర్వహించాలని  నిర్ణయం తీసుకుంది. 

మునుగోడు అసెంబ్లీ స్థానంనుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగాలని మాజీ  ఎంపీ  బూర నర్సయ్యగౌడ్  భావించారు. అయితే మాజీ  ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే కేసీఆర్ టికెట్  ఇచ్చాడు. కూసుకుంట్ల  ప్రభాకర్ రెడ్డికి బీ ఫాం  ఇచ్చిన  రోజునే  కూసుకుంట్ల  ప్రభాకర్ రెడ్డితో  పాటు  మాజీ  ఎమ్మెల్సీ  కర్నె  ప్రభాకర్ లను కేసీఆర్  పిలిపించి   మాట్లాడారు. జాతీయ  స్థాయిలో బూర నర్సయ్య గౌడ్  సేవలను వినియోగించుకొంటామని కేసీఆర్ చెప్పారు.అయితే గత కొంత కాలంగా  పార్టీలో   చోటుచేసుకున్న  పరిణామాలతో  పార్టీకి గుడ్ బై చెప్పాలని బూర నర్సయ్యగౌడ్ నిర్ణయం తీసుకున్నారు.

 మునుగోడు  నియోజకవరగంలో  జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధించి  తమకు ఎలాంటి  సమాచారం  ఇవ్వకపోవడంపై రెండు దఫాలు బూర నర్సయ్య గౌడ్ అసంతృప్తిని వ్యక్తం  చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మంత్రి  జగదీష్  రెడ్డి కూడ  స్పందించారు. పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలను భరించలేక పార్టీకి గుడ్ బై  చెప్పాలని నిర్ణయం  తీసుకున్నట్టుగా బూర  నర్సయ్య గౌడ్  చెప్పారు.

also read:నన్నుకలిసే వారిపై టీఆర్ఎస్ ఫోకస్: మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల 3వ తేదీన ఉప ఎన్నిక  జరగనుంది. ఈ స్థానం  నుండి కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి  ఈ దఫా  బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నారు.కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి  స్రవంతి,  టీఆర్ఎస్ అభ్యర్ధిగా   కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలోకి దిగారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios