మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను హత్యను చేసేందుకు కుట్ర పన్నిన కేసులో కీలక నిందితుడైన మున్నూరు రవి.. టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. అంత సెక్యూరిటీని దాటుకుని అతను ఎలా రాగలిగాడని నేతలు చర్చించుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) (telangana rashtra samithi) 21వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో బుధవారం జరుగుతున్న పార్టీ ప్లీనరీలో (trs plenary 2022) ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌ను (minister srinivas goud) హత్య చేసేందుకు ఇటీవల కుట్ర జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మున్నూరు రవి (munnuru ravi) ప్లీనరీలో ప్రత్యక్షమయ్యాడు. అంతేకాదు పార్టీ నేతలతో కలిసి ఫొటోలు దిగాడు. ఈ వ్యవహారం పార్టీ ప్లీనరీలో కలకలం రేపింది.
పార్టీ ప్లీనరీకి హాజరయ్యే నేతలకు సెక్యూరిటీ, బార్ కోడ్‌లున్న పాసులను జారీ చేసింది టీఆర్ఎస్. ఈ పాసులున్న వారే ప్లీనరీకి హాజరు కావాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు కూడా. అయితే మున్నూరు రవికి ఈ పాస్ లేకున్నా అతడు పార్టీ ప్లీనరీకి ఎలా హాజరయ్యాడన్న విషయం అంతుచిక్కకుండా వుంది. అయితే కేవలం పార్టీ ఐడీ కార్డుతోనే మున్నూరు రవి ప్లీనరీకి హాజరయ్యాడని ఆ తర్వాత తెలిసింది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కీలక ప్రసంగం చేస్తున్న సమయంలో కూడా మున్నూరు రవి అక్కడే వున్నాడు. ఈ నేపథ్యంలో రవి వ్యవహారం టీఆర్ఎస్‌లో చర్చనీయాంశమైంది.
కాగా.. Mahabubnagar అసెంబ్లీ స్థానం నుండి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత పథకం ప్రకారంగా తమను ఆర్ధికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించారని Raghavender Raju కుటుంబం ఆరోపిస్తుంది. ఆర్ధికంగా దెబ్బతినడంతో పాటు తమ కుటుంబ సభ్యుల ఆరెస్టు వెనుక మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడని రాఘవేందర్ రాజు సోదరులు భావించారు. దీనిలో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేయాలని ప్లాన్ చేశారు. రాఘవేందర్ రాజు కుటుంబానికి ఉన్న ఆధార్ సెంటర్ తో పాటు Bar ను నడపకుండా చేయడంలో పరోక్షంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలకంగా వ్యవహరించినట్టుగా రాఘవేందర్ రాజు సోదరులు అనుమానించారు. ఆనంద్, హైదర్ అలీ, శ్రీకాంత్ గౌడ్ లు తమను వేధింపులకు గురి చేస్తున్నారని కూడా రాఘవేందర్ రాజు సోదరులు పోలీసుల విచారణలో ఒప్పుకొన్నారు.
అటు Army లో పనిచేసిన తన తండ్రికి రావాల్సిన బెనిఫిట్స్ రాకుండా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అడ్డుకొన్నారని ఈ కేసులో ప్రధాన నిందితుడు మున్నూరు రవి ఆరోపిస్తున్నాడు. తాను ఏర్పాటు చేసుకొన్న స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కార్యక్రమానికి కూడా డబ్బులు రాకుండా మంత్రి అడ్డుకొన్నారని Munnur Ravi పోలీసుల విచారణలో ఒప్పుకొన్నాడు. అంతేకాదు తనకు ఎమ్మెల్సీ రాకుండా మంత్రి చక్రం తిప్పారని రవి చెప్పారు. ఈ కారణాలతోనే తాను రాఘవేందర్ రాజుకు సహాయం చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా మున్నూరు రవి పోలీసుల విచారణలో తెలిపాడు.
