హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. ప్రజాక్షేత్రంలో పట్టు నిరూపించుకునేందుకు అధికార, విపక్ష పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. 

మున్సిపల్  ఎన్నికలకు తక్కువ సమయం మాత్రమే ఉండడంతో విపక్ష పార్టీలు తమ వ్యూహలకు  పదును పెడతు న్నాయి. తెలంగాణలో  జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ జన సమితి, సిపిఐ, సిపిఎంలు  ఒకటయ్యాయి.

 ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎవరికివారే విడివిడిగా రంగంలోకి దిగారు. పట్టణ ప్రాంతాల్లో ఎన్నికలే కావడంతో విపక్ష పార్టీలు క్షేత్రస్థాయిలో పొత్తు లేకపోయినా.... అవగాహనతో  పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

ఈ విషయమై లెఫ్ట్, టీడీపీలతో కాంగ్రెస్ పార్టీ  నాయకత్వం చర్చించింది. కానీ, ఒంటరిగానే పోటీ చేసేందుకు ఆ పార్టీలు సుముఖంగా ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తేల్చి చెప్పాయి.

 స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అధికార పార్టీని ఎదుర్కొనేందుకు  కలిసివచ్చే నేతలతో పరస్పరం  సహకరించు కోవాలన్న సంకేతాలు విపక్షాలు ఇస్తున్నాయి.అధికారికంగా ఏలాంటి ప్రకటనలు చేయకపోయినా విపక్షాలు మాత్రం పరిస్థితులకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.

అధికార పార్టీని ఓడించేందుకు ఏకం కావాలన్న అభిప్రాయాన్ని విపక్ష పార్టీల నేతలు వ్యక్తం చేస్తున్నారు నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో నేతల మధ్య చర్చలు జోరుగా మొదలయ్యాయి.

రిజర్వేషన్లకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో అభ్యర్థులను పరిశీలించి అధికార పార్టీకి ధీటుగా ఉన్న అభ్యర్థికి మద్దతు ఇవ్వాలనే యోచనలో క్షేత్ర స్థాయిలో నేతలు  ఉన్నట్లు తెలుస్తోంది.

 విపక్ష పార్టీల నుంచి అభ్యర్థులు విడివిడిగా పోటీ చేస్తే అధికార పార్టీకి కలసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ అవగాహనతో రంగంలోకి దిగితే గులాబీ పార్టీ అభ్యర్థులకు ఎన్నికల్లో కొన్ని చోట్ల ఇబ్బందికర పరిణామాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి.స్థానిక ఎన్నికలు కావడంతో అభ్యర్థుల ప్రభావం కూడా ఫలితాల పై ఎక్కువగా ఉంటుంది.