హైదరాబాద్: మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల చైర్మెన్, మేయర్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన సత్తా చాటింది. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు ఉండగా 110 మున్సిపాలిటీల చైర్మెన్ పదవులు టీఆర్ఎస్ కు దక్కాయి. ప్రతిపక్షాల కన్నా తక్కువ స్థానాలు గెలుచుకున్న చోట ఎక్స్ అఫిషియో సభ్యుల సహకారం తీసుకుంది.

కాగా, జాతీయ స్థాయిలో బద్ధ శత్రువులైన బిజెపి, కాంగ్రెసు మున్సిపాలిటీ చైర్మెన్ ఎన్నికల్లో చేతులు కలిపాయి. టీఆర్ఎస్ ను అడ్డుకోవడానికి ఈ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకున్నాయి. మణికొండలో కాంగ్రెసుకు బిజెపి మద్దతు ఇచ్చింది. దీంతో మణికొండ చైర్మన్ పదవిని కాంగ్రెసు గెలుచుకుంది.

Also Read: నేరేడుచర్లలో కేవీపీకి ఓటు: ఉత్తమ్ తో గొడవ, మైక్ విరగ్గొట్టిన ఎమ్మెల్యే సైదిరెడ్డి

ఇదిలావుంటే, మక్తల్ లో బిజెపికి కాంగ్రెసు పార్టీ సహకరించింది. దీంతో మక్తల్ మున్సిపాలిటీ చైర్మన్ పదవిని బిజెపి గెలుచుకుంది. ఆమన్ గల్ మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా బిజెపి సొంతం చేసుకుంది. మజ్లీస్ రెండు చోట్ల చైర్మెన్ పదవులను గెలుచుకుంది. భైంసాలోనూ జల్ పల్లిలోనూ మజ్లీస్ పార్టీ ప్రతినిధులు చైర్మెన్ గా ఎన్నికయ్యారు. 

కాగా, తీవ్ర వివాదం చోటు చేసుకున్న నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సోమవారం సాయంత్రం 4 గంటలకు జరగనుంది. కేవీపీ రామచందర్ రావు ఓటు హక్కుపై ఇక్కడ వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మధ్య వాగ్వివాదం జరిగింది.

Also Read: పిడిగుద్దులు కురిపించుకున్న కోమటిరెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.

తెలంగాణలోని మున్సిపాలిటీల చైర్మెన్, నగరపాలక సంస్థల మేయర్ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. పలు చోట్ల కాంగ్రెసు, టీఆర్ఎస్ లకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. సోమవారంనాడు నగరపాలక సంస్థల మేయర్ పదవులకు, మున్సిపాలిటీల చైర్మెన్ పదవులకు ఎన్నికలు జచరుగుతున్న విషయం తెలిసిందే.