Asianet News TeluguAsianet News Telugu

ఫోర్జరీ పత్రాలతో కింగ్ కోఠీ ప్యాలెస్ ను రూ 300 కోట్లకు అమ్మేశాడు

ముంబైకి చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి ఫోర్జరీ పత్రాలతో ఏకంగా హైదరాబాదులోని కింగ్ కోఠీ ప్యాలెస్ ను అమ్మేశాడు. రూ.300 కోట్లకు రవీంద్రన్ అనే అతను కాశ్మీర్ ఐరిష్ కంపెనీకి దాన్ని విక్రయించాడు.

Mumbai firm staffer forges documents, sells Rs 300 crore Hyderabad palace
Author
King Kothi Palace, First Published Nov 11, 2019, 10:46 AM IST

ముంబై: ఫోర్జరీ పత్రాలతో ఓ ప్రైవెట్ సంస్థకు చెందిన ఉద్యోగి ఏకంగా హైదరాబాదులోని కింగ్ కోఠీ ప్యాలెస్ నే అమ్మేశాడు. కాశ్మీర్ కు చెందిన హాస్పిటాలిటీ కంపెనీకి ఆ ప్యాలెస్ ను రూ.300 కోట్లకు అమ్మేశాడు. కింగ్ కోఠీ ప్యాలెస్ ను విక్రయించిన ముంబైకి చెందిన కంపెనీ ఉద్యోగిని ముంబై అధికారులు అరెస్టు చేశారు. 

ఈ ఫ్రాడ్ లో మరో ఇద్దరికి కూడా భాగం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు నిందితుడిని హైదరాబాదుకు చెందిన సుందరం కోల్రుకుంద్రో రవీంద్రన్ (64)గా గుర్తించారు. ఆర్థిక నేరాల విభాగం 9వ యూనిట్ అధికారులు అతన్ని శుక్రవారంనాడు అరెస్టు చేశారు. మోసం, ఫోర్జరీ, క్రిమినల్ కుట్ర వంటి సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేశారు. 

పి. సురేష్ కుమార్, మొహమ్మద్ ఉస్మాన్, ముకేష్ గుప్తాల కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాశ్మీర్ కు చెందిన ఐరిస్ హాస్పిటాలిటీ సంస్థకు చెందిన ఇద్దరు సోదరులు అమిత్ ఆమ్లా, అర్జున్ ఆమ్లాల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

నజ్రీ బాగ్ ప్యాలెస్ ట్రస్ట్ నుంచి మూడేళ్ల క్రితం కింగ్ కోఠీగా పిలిచే 28,106 చదరపు గజాల నజ్రీ బాగ్ ప్యాలెస్  ను తాము కొనుగోలు చేసినట్లు ముంబైకి చెందిన నిర్మాణ సంస్థ నిహారిక ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఆరోపిస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. 

అధికారులు ఈ ఏడాది జూన్ లో హైదరాబాదు సందర్శించి ప్యాలెస్ ను ఐరిస్ హాస్పిటలాటీకి బదిలీ చేసినట్లు హైదరాబాదు రిజిస్ట్రార్ కార్యాలయంలో గుర్తించారు. ఈ ఏడాది జనవరిలో ఐరిష్ హాస్పిటాలిటీతో నిహారిక ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మాజీ ఉద్యోగులు ఇద్దరు సేల్ డీడ్ కుదుర్చుకుని, దాన్ని విక్రయించినట్లు విచారణలో తేలింది.

అధికారం లేకపోయినప్పటికీ సేల్ డీడ్ పై రవీంద్రన్, సురేష్ కుమార్ కంపెనీ తరఫున సంతకాలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. హైదరాబాదు ప్యాలెస్ కు సంబంధించి కుమార్, రవీంద్రన్ మధ్య నడిచిన బలమైన ఈమెయిల్ సంభాషణల సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. 

ఈ ఫ్రాడ్ బయటపడగానే నిందితులు దేశం విడిచి పారిపోకుండా లుకవుట్ నోటీసులు జారీ చేశారు. రవీంద్రన్ అక్టోబర్ 10వ తేదీన సింగపూర్ ఫ్లయిట్ ఎక్కడానికి ప్రయత్నించినట్లు హైదరాబాదులోని ఇమిగ్రేషన్ డిపార్టుమెంట్ పోలీసులకు తెలియజేసింది. లుకవుట్ నోటీసు కారణంగా అతన్ని ఇమిగ్రేషన్ అదికారులు ఆపేశారు. 

భారతదేశంలో విలీనం కాక ముందు ఆ ప్యాలెస్ చివరి హైదరాబాదు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అధికారిక నివాసంగా ఉండేది. అనారోగ్యంతో నిజాం 1967 మరణించారు. ప్రస్తుతం ప్యాలెస్ ప్రధాన భవనంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆస్పత్రి నడుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios