ములుగు సీతక్కకు ఢిల్లీలో కీలక పదవి

mulugu sitakka appointed as a aiwc general secretary
Highlights

రైట్ టైం లో రైట్ పోస్టు అనొచ్చా ?

ములుగు మాజీ ఎమ్మెల్యే దనసరి అనసూయ అలియాస్ సీతక్కకు కాంగ్రెస్ పార్టీ ఉన్నత పోస్టు కట్టబెట్టింది. మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని సీతక్కకు కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ. సీతక్క ఇటీవల కాలంలో టిడిపి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

సీతక్కను చేర్చుకునేందుకు టిఆర్ఎస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేసింది. ఎర్రబెల్లి దయాకర్ రావు చాలా శ్రమించారు. కానీ ఆమె టిఆర్ఎస్ లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేయలేదు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మనుగడ లేదన్న ఉద్దేశంతో ఆమె కాంగ్రెస్ వైపు అడుగులు వేశారు.

ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శనివారం సాయంత్రం ఈమేరకు సీతక్కను మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సీతక్కతోపాటు ఫాతిమా రొస్నా అనే నాయకురాలిని మహిళా కాంగ్రెస్ కార్యదర్శిగా నియమించారు.

తెలంగాణ రాజకీయాల్లో సీతక్క పేరు తెలియని వారు ఉండదరు. విప్లవ నేపథ్యం కలిగి ఉన్న ఆమెను టిడిపి అధినేత చంద్రబాబు అప్పట్లో పిలిచి పార్టీ టికెట్ ఇచ్చారు. 2009లో ములుగు ఎమ్మెల్యేగా సీతక్క ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలుగుదేశం పార్టీలో ఉండి తెలంగాణ కోసం తనవంతు పాత్ర పోషించారు. టిడిపి ఆంధ్రా పార్టీ అన్న విమర్శలను ఆమె శక్తివంచన లేకుండా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఉద్యమ ప్రభావం కారణంగా సీతక్క 2014 లో ఓటమిపాలయ్యారు.

తదనంతర కాలంలో టిడిపి నేత రేవంత్ రెడ్డితోపాటు సీతక్క కూడా రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆమె పోరాట పటిమ, గత నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కీలక పోస్టు కట్టబెట్టిందని చెబుతున్నారు. రేవంత్ తో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో సీతక్కు కీలక పదవి దక్కడంతో రేవంత్ వర్గం కొంత రిలాక్స్ అయినట్లు చెబుతున్నారు.  

loader