ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తేనే మద్దతు: కాంగ్రెస్ కార్యాలయంలోనే కాంగ్రెస్‌పై మందకృష్ణ ఫైర్
ఎస్సీ వర్గీకరణకు మద్దతివ్వాలని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రేకు ఇవాళ వినతి పత్రం సమర్పించారు.
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తేనే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తేల్చి చెప్పారు.ఎస్సీ వర్గీకరణకు మద్దతివ్వాలని కోరుతూ ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ నేతలకు సోమవారంనాడు లేఖ అందించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందించారు.
అనంతరం గాంధీ భవన్ లో మందకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని ప్రధాని మోడీకి లేఖ రాయాలని కాంగ్రెస్ పార్టీ నేతలను కోరినా పట్టించుకోలేదన్నారు. 9 ఏళ్లుగా ఈ విషయమై కాంగ్రెస్ నేతల చుట్టూ తిరుగుతున్నా కూడ ఆ పార్టీ నేతలు పట్టించుకోలేదన్నారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చే పార్టీ కాంగ్రెసైతే ఎందుకు ప్రధానికి లేఖ రాయలేదని ఆయన ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై పార్లమెంట్ లో బిల్లు పెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ బిల్లు పెట్టొచ్చు కదా అని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తేనే కాంగ్రెస్ కు అండగా ఉంటామని ఆయన తేల్చి చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వర్గీకరణపై బిల్లు పెట్టమంటే పెట్టలేదని ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.
అధికారంలో ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు సహకరించకపోయినా విపక్షంలో కూడ ఈ బిల్లు పెట్టాలని లేఖ రాసేందుకు కూడ కాంగ్రెస్ ముందుకు రాకపోవడంపై తమకు అనుమానాలు వస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో తాము ఎలా కాంగ్రెస్ కు మద్దతివ్వాలని ఆయన ప్రశ్నించారు. తమకు మద్దతు ఉంటుందని ఠాక్రే, రేవంత్ హామీ ఇచ్చారని మందకృష్ణ మాదిగ గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయమై మద్దతు కోరుతూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చి ఆ పార్టీపైనే మందకృష్ణ మాదిగ విమర్శలు చేయడం గమనార్హం.