హైదరాబాద్: అబ్దుల్లాపూర్ మెట్టు తహసీల్దార్ (ఎమ్మార్వో) విజయారెడ్డిని హత్య చేసేలా సురేష్ ను ఎవరు ప్రేరేపించారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. విజయారెడ్డిని హత్య చేసే ముందు సురేష్ తన పెదనాన్నతో ఫోన్లో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు.

Also read:నా భార్య హత్య వెనుక చాలా మంది హస్తం.. తహసీల్దార్ విజయారెడ్డి భర్త

హయత్‌నగర్ మండలం గౌరెల్లి గ్రామానికి చెందిన కూర రాజేష్ తాతకు ఔటర్ రింగ్ రోడ్డులో ఏడు ఎకరాల భూమి ఉంది. అయితే సురేష్ తండ్రితో పాటు ఆయన సోదరుడికి ఈ భూమిని పంచుకొన్నారు. సురేష్ తండ్రి కృష్ణకు ఈ భూమిలో రెండు ఎకరాలు మాత్రమే ఉంది.

ఈ భూమి విషయమై ఓ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ కన్ను పడింది. ఈ భూమిని విక్రయించాలని స్థానిక రైతులతో రియల్ ఏస్టేట్ సంస్థ ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా స్జానికులు చెబుతున్నారు.

AlsoRead tahsildar Vijaya: భూవివాదమే కారణమా, ఎవరీ విజయా రెడ్డి?...

అయితే కొత్త పాస్ పుస్తకాలు రాకపోవడంతో ఈ భూమి రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యం కాలేదు. ఈ భూ విషయమై సురేష్ తండ్రి కృష్ణతో పాటు కృష్ణ సోదరుడు దుర్గయ్య తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లేవాడు.

ఈ భూ వివాదం విషయమై సురేష్ ఏనాడూ కూడ ఒక్కడే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లలేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు.తండ్రి కృష్ణతో కానీ, లేదా సురేష్ సోదరుడితో కలిసి ఎక్కడికైనా  వెళ్లేవాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు.

సోమవారం నాడు మధ్యాహ్నం సురేష్ అబ్దుల్లాపూర్‌మెట్టు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. విజయారెడ్డిని హత్య చేసే ముందు సురేష్ తన పెదనాన్న దుర్గయ్యతో ఫోన్‌లో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు.

AlsoRead tahsildar vijaya reddy: ఏ భూవివాదం లేదు.. నా బిడ్డ మంచోడు: నిందితుడు సురేశ్ తల్లి...

గౌరెల్లి గ్రామంలో సోమవారం నాడు బోనాల పండుగ . గ్రామస్తులు  ఈ పండుగలో ఉన్నారు. సురేష్ మధ్యాహ్నం వరకు కట్టెలు కొట్టి ఇంటికి వచ్చాడు. భోజనం చేసిన తర్వాత సురేష్ అబ్దుల్లాపూర్ మెట్టుకు వెళ్లినట్టుగా కుటుంబసభ్యులు చెబుతున్నారు.

సురేష్ ఎప్పుడూ కూడ ఎక్కడికి వెళ్లడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. కానీ సురేష్ సోమవారం నాడు ఎందుకు అబ్దుల్లాపూర్ మెట్టు వద్దకు వెళ్లాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

సురేష్ గత ఆరు నెలల నుండి రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టుగా కుటుంబసభ్యులు చెప్పారు. తన పని తాను చేసుకొని ఇంట్లోనే ఉండే సురేష్ తహసీల్దార్ విజయారెడ్డిని హత్య చేశాడంటే నమ్మడం లేదు కుటుంబసభ్యులు.

మధ్యాహ్నం పూట తల్లి సురేష్ కు ఫోన్ చేసింది. కానీ, సురేష్ ఫోన్ తీయలేదు. మరో వైపు సురేష్ తండ్రి కృష్ణ కూడ ఆయనకు ఫోన్ చేసినా కూడ సురేష్ స్పందించలేదు. 

విజయారెడ్డి ముందు ఆత్మహత్యాయత్నం కోసం పెట్రోల్ తీసుకొని సురేష్ వచ్చాడా, లేదా విజయారెడ్డిని బెదిరించేందుకు పెట్రోల్ పోస్తానని చెప్పేందుకు పెట్రోల్ బాటిల్ తో వచ్చాడా అనే విషయమై పోలీసులు విచారణ చేయనున్నారు.

ఈ విషయమై  సురేష్ ను పోలీసులు ప్రశ్నించనున్నారు. హయత్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సురేష్ కు చికిత్స చేయిస్తున్నారు. సురేష్ కూడ తీవ్రంగా గాయపడ్డాడు.

విజయారెడ్డిని హత్య చేసే ముందు సురేష్ తన పెదనాన్న దుర్గయ్యతో ఫోన్ లో మాట్లాడిన విషయాన్ని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తహసీల్దార్ విజయారెడ్డిని హత్య చేసే విషయంలో దుర్గయ్య సురేష్ ను ప్రోత్సహించాడా అనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.

సురేష్ అప్పుడప్పడూ మతిస్థిమితం లేనట్టుగా వ్యవహరిస్తాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ అన్ని విషయాలపై పోలీసులు శాస్త్రీయంగా దర్యాప్తు చేస్తున్నారు.