తెలంగాణకు త్వరలో కేటీఆర్ ముఖ్యమంత్రి కానున్నారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ విషయంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.

కేటీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి అవ్వడని... ఆయన సమర్థత కేసీఆర్ కి తెలుసంటూ రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మంత్రి పదవులు ఆశిస్తున్న వాళ్లే కేటీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

సోమవారం అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో రేవంత్‌ మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ, కేటీఆర్‌ సీఎం పదవికి సమర్థుడు అయితే కేసీఆర్‌ అసమర్థుడా అని ప్రశ్నించారు.

ప్రజలు టీఆర్ఎస్ కి ఓట్లు వేసి గెలిపించారని... సీఎం ఎవరు అవుతారనేది వారి కుటుంబ సమస్య అని రేవంత్ పేర్కొన్నారు. కేటీఆర్ సీఎం అయితే... కవిత, హరీష్ రావు, సంతోష్ లకు సమస్య అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుందని కేసీఆర్‌ అనుకుంటే రసమయి బాలకిషన్‌ను సీఎం చేయాలని రేవంత్‌ వ్యాఖ్యానించారు.

 కేసీఆర్‌ కంటే ఎక్కువగా కేటీఆర్‌ అబద్ధాలు చెబుతున్నారని, కొడంగల్‌ నియోజకవర్గ అభివృద్ధి తన హయాంలోనే జరిగిందన్నారు. కేటీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే పోలేపల్లి ఎల్లమ్మపై ప్రమాణం చేసి చెప్పాలని, టీఆర్‌ఎస్‌ చెబుతున్నట్టు కొడంగల్‌ అభివృద్ధి వారి హయాంలో జరిగినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు.