నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత.. తప్పులో కాలేశారు. ట్విట్టర్ వేదిక ఆమె పొరపాటు చేయగా.. వెంటనే దానిని సరిచేసుకునే ప్రయత్నం చేశారు. ఇంతకీ మ్యాటరేంటంటే... బ్యాడ్మింటన్‌లో ప్రపంచవ్యాప్తంగా జరిగే టోర్నీలు ఒక ఎత్తయితే ఏడాది ముగింపులో నిర్వహించే వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ మరో ఎత్తు. 

ప్రపంచ మేటి ఎనిమిది మంది క్రీడాకారిణులు తలపడే ఈ టోర్నీ టైటిల్‌ సాధించడం ప్రతి షట్లర్‌ కల. అలాంటి అరుదైన టైటిల్‌ను భారత స్టార్‌ పీవీ సింధు సొంతం చేసుకుంది. దీంతో భారత్‌ నుంచి ప్రతి ఒక్కరూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


 
తాజాగా నిజామాబాద్ ఎంపీ కవిత కూడా.. సింధూని ప్రశంసించారు. అయితే.. భారత్ గెలిచింది అనే ఆనందంలో కవిత పొరపాటున తప్పుగా ట్వీట్ చేశారు.  వెంటనే గ్రహించిన కవిత తన తప్పును సవరించమని ట్విటర్‌ను కోరడం గమనార్హం. 

తొలుత కవిత ‘బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఫైనల్స్‌లో స్వర్ణం దక్కించుకున్న పీవీసింధు ఫస్ట్ ఇండియా అయినందుకు శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. అనంతరం తన తప్పును సవరించుకున్నారు. ‘ట్విటర్ ప్లీజ్ నా తప్పుని సవరించు.. ‘ఫస్ట్ ఇండియన్‌’గా మార్చు’ అని మరో ట్వీట్ చేశారు.