కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీపై నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శల వర్షం కురిపించారు. వచ్చే నెలలో తెలంగాణ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి సోనియాగాంధీ.. ఇక్కడకు వచ్చారు.

మేడ్చల్ లో ఏర్పాటు చేసిన ప్రచార సభలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కాగా.. ఆ విమర్శలకు ఎంపీ కవిత ఈ రోజు సమాధానం ఇచ్చారు. శనివారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సోనియాను విమర్శించారు.

సోనియా.. తెలంగాణ హక్కల గురించి మాట్లాడలేదని, పక్క రాష్ట్రం గురించి మాట్లాడారని కవిత పేర్కొన్నారు. సోనియా గాంధీ మాటలు.. అచ్చం చంద్రబాబు మాటల్లానే ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. సోనియా గాంధీ లాగా తాము ఇక్కడో మాట, ఢిల్లీలో ఓ మాట మాట్లాడమన్నారు.

తాము ఎక్కడైనా తెలంగాణ హక్కుల కోసమే పోరాడతామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎజండాను తెలంగాణలోకి తీసుకురావలనే కుట్ర కాంగ్రెస్ నేతలు చేస్తున్నారని మండిపడ్డారు.