అసలే కోట్లు పెట్టి కొనుకున్న టికెట్... పైగా పవన్ కల్యాణ్ లాంటి నటుడు దగ్గరుండి గెలిపించాడు. అందుకే పార్టీ మారిన ఎంపీ మల్లారెడ్డికి టీడీపీ మీద వ్యామోహం మాత్రం పోవడం లేదు.  

రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ గా ఉండకపోతే వచ్చే నష్టం ఏమీ లేకపోవచ్చు. ఒక రాజకీయ పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి వెళ్లినప్పుడు ఆ పార్టీ పేరును కూడా మరిచిపోతే పెద్ద ఇబ్బందే వస్తోంది. ఆ ఇబ్బంది ఎలా ఉంటుందో టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి జంప్ చేసిన ఎంపీ మల్లారెడ్డిని అడిగితే బాగా తెలుస్తోంది.

ఈ రెడిమేడ్ పొలిటీషన్ గురించి 2014 వరకు ప్రజలకు పెద్దగా ఏమీ తెలియదు. ఇంజనీరింగ్ కాలేజీలు, ఇతర బిజినెస్ లతో మంచి వ్యాపారవేత్తగా పేరుతెచ్చుకున్న మల్లా రెడ్డి చాలా భారీగా కష్టపడి మల్కాజిగిరి ఎంపీ గా పోటీ చేసేందుకు టీడీపీ నుంచి టికెట్ తెచ్చుకోగలిగారు.

తెలంగాణ ఉద్యమ వేడి బాగానే ఉన్నా... పవన్ కల్యాణ్ ప్రచారం, ఆంధ్రుల అండదండలతో ఆయన కనాకష్టంగా గెలిచిపోయారు. కానీ, ఏం లాభం టీడీపీ నుంచి గెలవడంతో ఆయన పరిస్థితి తెలంగాణలో కరివేపాకులా తయారైంది. అందుకే వెంటనే అధికారంలో ఉన్న కారు పార్టీలోకి దూకేశారు.

కాకలుతీరిన రాజకీయవేత్తకాకపోవడంతో ఆయన ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇటీవల ఆయన కాలేజీలో ఓ ఫంక్షన్ జరిగింది. దానికి టీఆర్ఎస్ ఎంపీ కవితను కూడా ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. కాలేజీ తనదే కాబట్టి మల్లారెడ్డి మైక్ అందుకొని విద్యార్థలునుద్దేశించి ప్రసంగించారు. చివర్లో మాత్రం జై తెలుగుదేశం అంటూ తనను గెలిపించిన పార్టీపై అభిమానాన్ని చాటుకున్నారు. కానీ, అక్కడున్నవారు విషయం చెప్పడంతో ఆయన నాలుకర్చుకొని తాను జంప్ చేసిన పార్టీకి మళ్లీ జై కొట్టారు.

అదే సభలో ఉన్న కవితక్క తర్వాత ఈ విషయంపై మల్లారెడ్డి కి చురకలు అంటించింది. మల్లన్న టీఆర్ఎస్ లో ఉన్నా పచ్చ వాసన పోనట్టుంది అంటూ తన దైన శైలిలో సెటైర్ వేసింది.