సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యంతో  ఓ మహిళ బస్టాండ్ ఆవరణలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.  తల్లి, బిడ్డను  ప్రభుత్వాసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. ప్రస్తుతం ఆసుపత్రిలో బాలింతరాలు చికిత్స పొందుతుంది.

మౌనిక నిండు గర్భిణీ. ఆమెకు నొప్పులు రావడంతో చందుర్తి ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు నిరాకరించడంతో ఆమె సిరిసిల్ల ప్రాంతీయ ఆసుపత్రికి వెళ్లింది..  సిరిసిల్ల ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో మౌనిక తిరుగు ప్రయాణమైంది.

 వేములవాడ బస్టాండ్‌కు చేరుకొనేసరికి ఆమెకు నొప్పులు తీవ్రమయ్యాయి. ఆసుపత్రి ఆవరణలోనే ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది.

డెలివరీ కోసం వెళ్లిన మౌనిక పట్ల వైద్యులు వ్యవహరించిన తీరుపై కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే మౌనిక బస్టాండ్ లో బిడ్డకు జన్మనివ్వాల్సిన పరిస్థితి నెలకొందని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.