ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయం తర్వాత టీడీపీని నందమూరి కుటుంబానికి అప్పగించాలనే డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ నేత మోత్కుపల్లి నరసింహులు ఎన్టీఆర్ ఘాట్ ని సందర్శించారు. ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుపై విమర్శలతో చెలరేగిపోయారు. చంద్రబాబు వైఖరికి ఎదురుతిరగడంతో టిడిపి నుంచి ఆయన్ని బహిష్కరించిన సంగతి తెలిసిందే. 

ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. ఎన్నో ఏళ్లుగా చంద్రబాబు రాజకీయ అరాచకాలని భరిస్తున్న ప్రజలు ఈ ఎన్నికలతో రాజకీయ సమాధి కట్టారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వల్లే తెలంగాణాలో టిడిపి బలైపోయింది. ఆంధ్రాలో కూడా పతనమైపోయింది. ఇక పార్టీకి రాజీనామా చేసి టిడిపి భాధ్యతల్ని నందమూరి కుటుంబ సభ్యులకు అప్పగించాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. 

వెన్నుపోటుతో చంద్రబాబు ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కున్నారు. ఎన్టీఆర్ ఆత్మే ఆంధ్ర ప్రజలందరినీ ఆవహించి జగన్ అఖండ విజయం సాధించేలా చేసింది. ఓటుకు నోటుకేసులో చంద్రబాబు పట్టుబడి పార్టీ పరువుతీశారు. కేసీఆర్ కు భయపడి తెలంగాణ నుంచి పారిపోయారు అని మోత్కుపల్లి విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న జగన్ కు మాల, మాదిగల తరుపున మోత్కుపల్లి శుభాకాంక్షలు తెలియజేశారు.