తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మరో కలకలం రేగింది. తాజాగా ఆ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్ మోత్కుపల్లి నర్సింహులు సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దుక్నం మూసేయాలన్న ధోరణిలో మాట్లాడారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన మోత్కుపల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారో చదవండి.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉంటుందన్న భరోసా లేదు. ఈ పార్టీని టిఆర్ఎస్ లో విలీనం చేస్తే మంచిది. టిఆర్ఎస్ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి పుట్టిన పార్టే. కేసిఆర్ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఎదిగి వెళ్లినవాడే. కాబట్టి తెలుగుదేశం పార్టీని విలీనం చేయడం ఉత్తమం. తెలంగాణలో పార్టీని డెవలప్ చేసేందుకు సహకరించేవారే లేరు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పక్క  రాష్ట్రంలో ఉన్నందున తెలంగాణలో సమయం వెచ్చించే పరిస్థితులు లేవు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు హైదరాబాద్ రాకపోవడం దీనికి నిదర్శనం. ఎన్టీఆర్ ఘాట్ హైదరరాబాద్ లో ఉన్నది కానీ.. పార్టీ అధినేత వచ్చి నివాళులు అర్పించలేకపోయారు. అంటే తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం కష్టమేకదా? కాబట్టి టిఆర్ఎస్ లో విలీనం చేయడమే ఉత్తమం. ఒకవేళ చంద్రబాబు స్వయంగా తెలంగాణ అంతటా రథమేసుకుని తిరిగితే తప్ప పార్టీని బతికించలేం.

ఎక్కడ చూసినా.. టిడిపి అంతరించిపోతదనే అభిప్రాయాన్ని చెబుతున్నారు. ఈ విషయం వింటే బాధ కలుగుతున్నది. దీన్ని బుజనా వేసుకుని నడుపుదామన్నా ఎవరూ సహకరించడం లేదు. మహనీయుడు పెట్టినటువంటి పార్టీ ఇది ఉండదేమో అని అభిప్రాయపడుతున్నారు. అందుకే నాకు బాధ కలుగుతున్నది. టిఆర్ఎస్ నేత కేసిఆర్ మన పార్టీ నుంచి పోయినోడే.. అందులో ఉన్న మంత్రులంతా చంద్రబాబు కింద పనిచేసినవారు. 22 శాతం ఉన్న తెలుగుదేశం పార్టీని 40 లక్షల మంది ఓటరు దేవుళ్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అన్నదమ్ముల్లా టిఆర్ఎస్ లో విలీనం చేసుకుని కలిసి పనిచేద్దాం. పార్టీలో సీనియర్ నాయకుడిగా చెబుతున్న.. ఈ పార్టీని టిఆర్ఎస్ లో మెర్జ్ చేయడం గౌరవంగా ఉంటుంది. లేదంటే తెలంగాణలో చంద్రబాబు ఒక రథం వేసుకుని తిరిగి ఈ పార్టీని బతికించాలి.