హైదరాబాద్‌ : చంద్రబాబు నాయుడు ఘోరపరాజయంతో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ఘోష నెరవేరిందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఎన్టీ రామారావుకు ఆయన మంగళవారం నివాళులు ఆర్పించ్ారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మోత్కుపల్లి తీవ్రంగా ధ్వజమెత్తారు.  తెలంగాణలో పార్టీ పెట్టిన ఎన్టీఆర్ ఏ పనైనా తెలంగాణ నుంచే మొదలు పెట్టారని ఆయన అన్నారు. దేశానికి ప్రధాని కావాల్సిన వ్యక్తిని చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. 

చంద్రబాబు వెన్నుపోటుతోనే ఎన్టీఆర్‌ ప్రాణాలు వదిలారని, ఆయన ప్రాణాలు తీయటమే కాకుండా బ్యాంక్ అకౌంట్స్‌ కూడా లాక్కున్నారని మోత్కుపల్లి అన్నారు.ఎన్టీఆర్‌ ఘోష ఇప్పుడు నెరవేరిందని, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ఎప్పుడూ ఎన్టీఆర్‌ ఆశీస్సులు ఉంటాయని ఆయన అన్నారు. అందరినీ మోసం చేసి ఏదో చేసినట్టు గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు ఎలా చిత్తు చిత్తుగా ఓడారని ప్రశ్నించారు. 

వైఎస్‌ జగన్ ఫ్యాన్ గాలికి టీడీపీ కొట్టుకు పోయిందని ఆయన అన్నారు. ఏమాత్రం మనస్సాక్షి ఉన్నా చంద్రబాబు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, ఎన్టీఆర్‌ కుటుంబానికి అప్పగించాలన్నారు. జగన్ దేవుని దయతో గెలిచానని చెప్పడం ఎంతో సంతోషమన్నారు. 

కేసీఆర్ రాజకీయాలకు తావు లేకుండా ఎన్టీఆర్‌ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. తనకూ కేసీఆర్ కు మాత్రమే కాకుిండా ఎంతో మందికి రాజకీయ బిక్ష పెట్టింది ఎన్టీఆరేనని మోత్కుపల్లి ఆయన అన్నారు.