హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఖేల్ ఖతమైనట్లే కనిపిస్తోంది. ఆయన ఇక ఎంత మాత్రం తెలుగుదేశం పార్టీలో కొనసాగే పరిస్థితి లేదనేది అర్థమవుతోంది. తనను తెలంగాణ మహానాడుకు పిలువ లేదని మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. 

భువనగిరి మినీ మహానాడుకు పిలిస్తే మోత్కుపల్లి రాలేదని తెలంగాణ టీడీపి అధ్యక్షుడు ఎల్ రమణ చెప్పారు. దాంతోనే తెలంగాణ మహానాడుకు పిలువలేదనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. నిజానికి, తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మోత్కుపల్లి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. 

ఆయనకు గవర్నర్ పదవి దక్కాల్సి ఉండింది. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహాత్మకంగా చంద్రబాబును దూరం పెట్టే క్రమంలో ఆయనకు ఆ పదవి దక్కలేదు. అప్పటి నుంచి మోత్కుపల్లి అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుండా టీడీపిపై తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. 

టీడీపిని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో విలీనం చేస్తే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. అప్పటి నుంచే ఆయనను చంద్రబాబు దూరం పెడుతూ వచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై చంద్రబాబు మీది నమ్మకంతో తీవ్రమైన మాటల యుద్ధం చేసిన రేవంత్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయారు. అంతే తీవ్రమైన స్థాయిలో కేసీఆర్ పై మోత్కుపల్లి నర్సింహులు విమర్శలు చేశారు. ఇప్పుడు మోత్కపల్లికి టీడీపిలో స్థానం లేకుండా పోయింది.

టీడీపీలో రేవంత్ రెడ్డికి, మోత్కుపల్లికి మధ్య విభేదాలు కొనసాగుతూ వచ్చాయి. అంతకు ముందు ఎర్రబెల్లి దయాకర్ రావుకు, నాగం జనార్దన్ రెడ్డికి మధ్య టీడీపి తీవ్రమైన విభేదాలు చోటు చేసుకుని ఇద్దరూ రచ్చకెక్కారు. ఆ తర్వాత ఇద్దరు కూడా టీడీపీని వీడిపోయారు. ఇప్పుడు మోత్కుపల్లి వంతు వచ్చింది.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్న మోత్కుపల్లి నర్సింహులుకు తెలుగుదేశం పార్టీని పెట్టిన తర్వాత ఎన్టీఆర్ పిలిచి మరీ ఆలేరు సీటు ఇచ్చారు. ఆలేరు ఎస్సీలకు అప్పుడు రిజర్వ్ అయి ఉంది. విద్యావంతుడు కావడంతో ఎన్టీఆర్ కు మోత్కుపల్లి నర్సింహులా బాగా నచ్చారు.

మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వ హయాంలల్లో మంత్రి పదవులు నిర్వహించారు. నిజానికి, తెలుగుదేశం పార్టీలో నర్సింహులుకు ఎనలేని ప్రాధాన్యం దక్కింది.