భర్త మీద కోపంతో పాటు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ప్రియుడిపై మోజుతో ఓ తల్లి తన కన్నబిడ్డను అత్యంత దారుణంగా హతమార్చింది.  వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కొమ్మూగూడెనికి చెందిన దుర్గం శంకరయ్య, దీపలకు ఎనిమిదేళ్ల క్రితం పెళ్లయ్యింది.

శంకరయ్య గ్రామంలో పశువుల కాపరిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ దంపతులకు మూడేళ్ల కిందట ఇద్దరు ఆడపిల్లలు పుట్టి కొద్దిరోజులకే మరణించారు. తదనంతరం బాబు జన్మించాడు.

ఈ క్రమంలో దీప గ్రామానికి చెందిన మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. పుట్టిన బాబును కూడా సక్రమంగా చూడకపోయేది.. దీంతో బంధువులే పిల్లాడిని పెంచారు. పశువులు కాసేందుకు శంకరయ్య ఉదయం వెళ్తే సాయంత్రం వచ్చేవాడు.

ఈ సమయంలో తన ప్రియుడితో దీప ఏకాంతంగా గడిపేది. ఈ గ్యాప్‌లోనూ కొడుకు తనకు అడ్డుగా ఉన్నాడని భావించిన ఆమె పసివాడిని సైతం చంపేందుకు కుట్ర పన్నింది. మంగళవారం యథాప్రకారం శంకరయ్య పశువులను తోలుకుని వెళ్లాడు. బిడ్డను దగ్గరికి తీసుకున్న ఆమె... కొడుకు గొంతు నులిమి శ్వాస ఆడకుండా చంపివేసి మంచంలో పడుకోబెట్టింది.

తిరిగి ఏమి తెలియనట్లు నటించింది. అయితే చుట్టుపక్కల వారు గమనించి దీపను నిలదీయగా బిడ్డను తాను చంపినట్లు అంగీకరించింది. కాగా, కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగేవని, భర్త మీద కోపంతో కుమారుడిని చంపాలని దీప పలుమార్లు ప్రయత్నించగా స్థానికులు అడ్డుపడ్డట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దీపను అదుపులోకి తీసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు.