కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లే వారి పాలిట కసాయిలా మారి కడతేర్చింది. వివరాల్లోకి వెళితే.. సిద్థిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌కు చెందిన చిట్యాల భాస్కర్, జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తక్కల్లపల్లి గ్రామానికి చెందిన సరోజ ఏడేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు.

వీరికి అయాన్, హర్షవర్థన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు గతేడాది కాలంగా సిద్థిపేటలోని గణేశ్ నగర్‌లో ఉంటున్నారు.  భాస్కర్ స్థానిక ఆర్టీసీ డిపోలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చేసి రెండు రోజుల క్రితం మానేశాడు.

అనంతరం కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే గత వారం రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం భాస్కర్ ఏదో పని నిమిత్తం బయటకు వెళ్లాడు.

ఇంట్లో ఎవరు లేని సమయం చూసిన సరోజ.. ఇదే అదనుగా ‘‘భర్తకు నాకు గొడవలవుతున్నాయి.. నా పిల్లలను చంపి నేను చనిపోతున్నా’’ నంటూ సూసైడ్ నోట్ రాసింది. మధ్యాహ్నం తన ఇద్దరు పిల్లలు అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి బీరు సీసాలు, కత్తితో చిన్నారుల కడుపులో పొడిచి చంపేసింది.

అనంతరం కరీంనగర్‌లోని లోయర్ మానేరు డ్యామ్‌లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లింది. అయితే ధైర్యం చాలక అక్కడి వన్‌ టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది. కరీంనగర్ పోలీసులు అందించిన సమాచారంతో సిద్ధిపేట పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

అప్పటికే చిన్నారులిద్దరు రక్తపుమడుగులో విగత జీవులుగా పడివున్నారు. వారి పక్కనే పగిలిపోయిన బీరు సీసాలు, రక్తపు మరకలతో పిల్లల పేగులు బయటకు వచ్చాయి. పిల్లలు చనిపోయిన విషయం తెలుసుకున్న భాస్కర్ హుటాహుటిన ఇంటికి వచ్చి కన్నీరుమున్నీరుగా విలపించాడు.

అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు పిల్లల మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎప్పుడూ సందడిగా తిరిగే చిన్నారులను కన్నతల్లే చంపడంతో కాలనీ వాసులు దిగ్భ్రాంతికి గురయ్యారు.