Asianet News TeluguAsianet News Telugu

తల్లి స్కెచ్.. కొడుకుల చోరీలు

తల్లి వేసిన పథకం ప్రకారమే చోరీలు

mother encourages the sons to robbery in hyderabad

ఏ తల్లైనా తమ కుమారులు సమక్రమ మార్గంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటారు. పక్కదారి పడుతున్నట్లు తెలిస్తే.. వారికి దండించి మరీ సరైన దారిలో పెడుతుంటారు. కానీ ఈ తల్లి మాత్రం ఇద్దరు కుమారులను చోరీలకై ప్రోత్సహించింది. అంతేకాదు స్వయంగా ఎలా దొంగతనం చేయాలో ఆమె స్కెచ్ వేస్తుంది. తల్లి వేసిన పథకం ప్రకారం కుమారులు ఇద్దరు దొంగతనాలకు పాల్పడుతున్నారు. 

ఇలా మూడేళ్ల నుంచి పోలీసులకు దొరక్కుండా నేరాలకు పాల్పడుతున్న ముఠాను  పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి 1.65 కిలోల బంగారు ఆభరణాలు, 80 తులాల వెండి, ఖరీదైన గడియారాలు, అమెరికన్‌ డాలర్లు  సహా రూ.75లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

 చాంద్రాయణగుట్టలో నివాసముంటున్న సనాబేగం అలియాస్‌ నజిమున్నీసా, ఆమె కుమారులు సయ్యద్‌ మహ్మద్‌, సయ్యద్‌ సాహిల్‌ హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్ల పరిధుల్లో 33 ఇళ్లల్లో దొంగతనాలు చేశారని తెలిపారు. జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ఇళ్లను సనాబేగం ఎంపిక చేస్తే... కుమారులిద్దరు రెండు, మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహిస్తారు. 

ఇంటి వెనుక వంట గది లేదా పడక గది కిటీకీల గ్రిల్స్‌ తొలగించి లోపలికి వెళ్లి చోరీలు చేస్తున్నట్లు వివరించారు. బాధితులు ఫిర్యాదు చేసినా సంఘటన స్థలాల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో 33 కేసుల్లోనూ వీరిని పట్టుకోలేదని కమిషనర్‌ వివరించారు. ఒక సీసీ కెమెరాలో ఫుటేజీ ఆధారంగా వీరు పోలీసులకు చిక్కారని చెప్పారు.

కుమారులతో దొంగతనాలు చేయిస్తున్న సనాబేగం కార్వాన్‌ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలిగా చెప్పుకొనేదని కొత్వాల్‌ అంజనీకుమార్‌ తెలిపారు. చోరీలకు టోలీచౌకీ, గోల్కొండ, బంజారాహిల్స్‌ ప్రాంతాలు అనువుగా ఉంటాయన్న భావనతో ఆమె, కుమారులు మూడేళ్ల క్రితం టోలీచౌకీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు.


 తెరాస మహిళా అధ్యక్షురాలిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో గోల్కొండ, కార్వాన్‌, టోలీచౌకీ ప్రాంతాల్లో ఆమెను ఎవరూ అనుమానించేవారు కాదు. దీన్ని అవకాశంగా మలుచుకుని కుమారులతో దొంగతనాలు చేయిస్తోంది. దొంగసొత్తును తీసుకురాగానే.. చార్మినార్‌ వద్ద నూర్‌ జువెలర్స్‌ యజమాని మహ్మద్‌ నూరుద్దీన్‌కు ఇచ్చి డబ్బు తీసుకునేవారు. సనాబేగం పార్టీ నాయకురాలు కావడంతో  ఆమె తెస్తున్న నగలపై నూరుద్దీన్‌కు అనుమానం రాలేదు. అతడి నుంచి డబ్బు తీసుకున్న తర్వాత ముగ్గురూ  విందులు వినోదాలు చేసుకునేవారని పోలీసులు వివరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios