చేతికి అందివచ్చిన కొడుకు పాము కాటుకు గురై, వైద్యానికి డబ్బులు లేవన్న బెంగతో తల్లి గుండెపోటుతో మరణించిన విషాద సంఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. నల్లగొండ జిల్లా, చిట్యాల మండలం చిన్నకాపర్తికి చెందిన మెట్టు ఆండాళ్లు(46)కు నిర్మల, స్వామి అనే ఇద్దరు పిల్లలున్నారు. 

భర్త అంజయ్య 12 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఆండాళ్లు తమకున్న 4 ఎకరాల భూమిని సాగు చేయిస్తూ పిల్లల్ని పెంచుతోంది. ఈ నెల 7న గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన స్వామిని పాము కాటేసింది. వెంటనే స్వామిని నల్లగొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. 

పేరుకు నాలుగెకరాల పొలం ఉన్నా.. దాని మీద వారి ఆదాయం అంతంత మాత్రమే. ఇలాంటి సమయంలో బిడ్డకు చికిత్స చేసేందుకు డబ్బులెలా తేవాలో అన్న బెంగ ఆండాళ్లును వేధించింది. ఆ ఆదుర్దాతో ఆమెకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో.. ఆసుపత్రిలోని సందర్శకుల ప్రాంగణంలోనే ప్రాణాలు విడిచింది.

అక్కడే ఐసీయూలో ఉన్న కుమారుడికి తల్లి మృతి విషయం కూడా తెలియదు. కూతురు నిర్మల తమ బంధువుల సాయంతో తల్లికి అంత్యక్రియలు నిర్వహించింది. ఇప్పటికే తండ్రిని, ఇప్పుడు తల్లిని కోల్పోయి, తమ్ముడు ఆస్పత్రిలో ఉండటంతో నిర్మల కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.