గద్వాల: భార్యాభర్తల మద్య చోటుచేసుకున్న చిన్న గొడవ నాలుగు ప్రాణాలను బలితీసుకుంది. భర్తతో గొడవపడిన మహిళ ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. 

జోగులాంబ గద్వాల జిల్లా తిమ్మన్ దొడ్డి మండలానికి చెందిన కంబయ్య, సత్తెమ్మ దంపతులు నలుగురు పిల్లలతో కలిసి జీవించేవారు. తమకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఇలా సంతోషంగా గడుస్తున్న వారి జీవితాల్లో  ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. 

పొలం పనుల విషయంలో భార్యభర్తల మధ్య గొడవ చోటుచేసుకుంది. దీంతో కొడుకును వెంటపెట్టుకుని కంబయ్య పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో భర్తతో గొడవ కారణంగా తీవ్ర మనస్థాపానికి గురయిన సత్తెమ్మ దారుణ నిర్ణయం తీసుకుంది. ముగ్గురు ఆడ పిల్లలతో కలిసి ఊరి శివారులోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. 

చెరువులో నాలుగు మృతదేహాలను స్థానిక రైతులు గుర్తించి గ్రామస్తులు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.