Asianet News TeluguAsianet News Telugu

చైన్ స్నాచర్ కాదు.. కన్నతల్లే కడతేర్చింది.. చిన్నారి మృతికేసులో ట్విస్ట్...

యేడాది దాటినా ఎలాంటి కదలికలూ లేని కన్నకూతురి భవిష్యత్తు ఆమెను భయపెట్టింది. చుట్టుముడుతున్న ఆర్థిక ఇబ్బందులు ఆమెను కృంగదీశాయి. దీనికితోడూ బంధువుల సూటిపోటి మాటలు మానసిక వేదనకు గురిచేశాయి. దీంతో కడుపుచించుకుని పుట్టిన కన్నకూతురినే కర్కశంగా కడతేర్చింది. 

mother assassinated one and half year old daughter in jangaon
Author
Hyderabad, First Published Aug 2, 2022, 1:00 PM IST

జనగామ : కన్న బిడ్డలో కదలికలు లేవని..  ఇక ఎప్పటికీ రావని…ఆమె భవిష్యత్తు భారం అవుతుందని భావించిన కన్నతల్లి కర్కశురాలిగా మారింది. జీవితకాలం చిన్నారి ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆలోచించింది. దీనికి తోడూ చుట్టుముడుతున్న ఆర్థిక కష్టాలు.. వెరసి ఆ తల్లే పసికందును కడతేర్చింది.  ఏడాదిన్నర వయస్సున్న చిన్నారిని నీటి తొట్టెలో వేసి ప్రాణాలు తీసింది.  మనసును కలచివేసే ఈ ఘటన  సోమవారం నాడు జనగామలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వెస్ట్ జోన్ డిసిపి  తెలిపిన వివరాల ప్రకారం…

జనగామలోని అంబేద్కర్ నగర్ కు చెందిన భాస్కర్, స్వప్న దంపతులకు ఇద్దరు పిల్లలు. మొదటి సంతానం కుమారుడు నవనీత్. రెండో సంతానం కూతురు తేజస్విని. అయితే కూతురు తేజస్వినికి  ఏడాది వయస్సు దాటినా ఆమెలో కదలికలు లేకపోవడం, మాటలు రాక పోవడంతో అచేతనంగానే ఉంటుంది. దంపతులిద్దరూ కూతురు కోసం ఆసుపత్రుల చుట్టూ తిరిగారు.అయితే, పాపకు  భవిష్యత్తులో కూడా కదలికలు వచ్చే అవకాశం లేదని వైద్యులు తేల్చి చెప్పారు. ఇదే సమయంలో కుమారుడు నవనీత్ గుండెలో రంధ్రం ఉండడంతో రూ. ఎనిమిది లక్షలు ఖర్చుచేసి బైపాస్ సర్జరీ చేయించారు.

చిన్నారి ప్రాణం తీసిన చైన్ స్నాచర్.. తల్లి పుస్తెలతాడు లాక్కొనే క్రమంలో ఘాతుకం

పుట్టిన ఇద్దరు పిల్లలు అనారోగ్యం బారిన పడడంతో భాస్కర్, స్వప్న తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే తేజస్విని భవిష్యత్తు భారమవుతోందని భావించిన స్వప్న దారుణ నిర్ణయం తీసుకుంది.  సోమవారం ఉదయం 11 గంటలకు.. భర్త ఇంట్లో లేని సమయంలో.. ఇంటి ముందున్న నీటి తొట్టెలో పాపను పడవేసింది. దీంతో ఊపిరాడక చిన్నారి మృతి చెందింది.

పాప హత్య విషయం తన మీదికి రాకుండా ఉండేందుకు స్వప్న ఎవరో దుండగులు ఈ పని చేశాడని  నమ్మించేందుకు ప్రయత్నించింది. గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి, తన పుస్తెలతాడు లాక్కునేందుకు ప్రయత్నించాడని,  వదలకపోయేసరికి పాప తేజస్వినిని ఎత్తుకెళ్లి ఇంటి ముందు నీటిలో సంపులో పడేశాడని చెప్పింది. జనగామ ఏసిపి గజ్జి కృష్ణ, సీఐ ఎలబోయిన శ్రీనివాస్ స్వప్న, ఆమె భర్త భాస్కర్ ని విచారించారు.  ఈ సందర్భంగా స్వప్న విస్తుపోయే నిజాలను తెలిపింది.

తన కుమార్తె తేజస్విని కదలలేని స్థితిలో ఉందని.. పెంచడం భారంగా అనిపించిందని వెల్లడించింది. బంధువులు సూటిపోటి మాటలు తట్టుకోలేకే తాను పాప ప్రాణాలు తీశానని చెప్పింది. పోలీసులు స్వప్న నేరాంగీకార వాంగ్మూలాన్ని వీడియో రికార్డు ద్వారా నమోదు చేశారు. స్వప్నను అరెస్టు చేసి.. రిమాండ్కు తరలిస్తున్నట్లు డీసీపీ సీతారాం చెప్పారు. తేజస్విని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.  భాస్కర్ ఇచ్చని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios