నారాయణఖేడ్: కరోనా భయంతో కొడుకు చనిపోగా కడుపుకోతను తట్టుకోలేక తల్లి మృత్యువాతపడ్డ విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో చోటుచేసుకుంది. తల్లీకొడుకులిద్దరు ఇలా హటాత్తుగా మృతిచెందడంతో ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

నారాయణఖేడ్ లో బాబుసింగ్(32)అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసముండేవాడు. అయితే కొద్దిరోజులుగా అతడు కరోనా లక్షణాలతో బాధపడుతూ తీవ్ర భయాందోళను లోనయ్యాడు. కరోనా పరీక్ష చేసుకోకుండానే తనకు కరోనా సోకిందని నిర్దారణకు వచ్చాడు. దీంతో అతడి భయం మరింత పెరిగి మృత్యువాతపడ్డాడు. 

అయితే కొడుకు మృతిని తట్టుకోలేక అతడి తల్లి కూడా గుండెపోటుతో మృతిచెందింది. కొడుకు చనిపోయినట్లు తెలియగానే ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోగా కుటుంబసభ్యులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఇలా కరోనా భయంలో ఒకరు, గుండెపోటుతో మరొకరు మృతిచెందడంతో ఆ కుటుంబం దు:ఖంలో మునిగిపోయింది.