Asianet News TeluguAsianet News Telugu

ముగ్గురు పిల్లల్ని కాళ్లు, చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి.. యాదగిరిగుట్టలో వదిలేసి వెళ్లిన కన్నతల్లి...

భర్త విడిచివెళ్లిపోవడంతో వేరే వ్యక్తితో సహజీవనం చేస్తున్న మహిళ.. తన ముగ్గురు చిన్నారులను అనాథలుగా వదిలేసి వెళ్లిపోయింది. ఈ దారుణమైన ఘటన యాదగిరిగుట్టలో వెలుగు చూసింది. 

mother abandoned three children over extramarital affair in yadagirigutta
Author
First Published Jan 23, 2023, 12:51 PM IST

యాదగిరిగుట్ట : లోకం పోకడ తెలియని పసికూనలు... తల్లిదండ్రులు  ఏమయ్యారో… తామెందుకు ఒంటరిగా ఉన్నామో.. తామెప్పుడూ చూడని ప్రదేశంలో తమనెందుకు వదిలేసారో తెలియని అమాయకులు ఆ చిన్నారులు.  తండ్రి ఏనాడో వదిలేసి వెళ్లిపోగా..  కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లి.. ఊరు కాని ఊరు తీసుకువచ్చి  వారిని వదిలేసి వెళ్లిపోయింది. ఏం చేయాలో ఎటు పోవాలో దిక్కుతోచగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆ చిన్నారులను ఓ ట్రాఫిక్ పోలీస్ గుర్తించి బాలల సంరక్షణ కేంద్రానికి తరలించాడు. యాదగిరిగుట్టలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

దీనికి సంబంధించిన వివరాలను యాదగిరిగుట్ట ట్రాఫిక్ సిఐ శివశంకర్, ఎస్ఐ సుధాకర్ లు ఆదివారం మీడియాకు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..  ఈ నెల 15 సంక్రాంతి రోజు  యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం దగ్గర ఓ ముగ్గురు చిన్నారులు కనిపించారు. అదే చిన్నారులు ఆ తర్వాత బస్టాండ్ దగ్గర కూడా అనుమానాస్పదంగా కనిపించారు. వారి వయసు వరుసగా 8,7,5  సంవత్సరాలు. కాసేపు వారిని గమనించిన అక్కడి ట్రాఫిక్ కానిస్టేబుల్ కోటి.. వారితో పెద్దలు ఎవరూ లేరని.. చిన్నారులు ముగ్గురు ఒంటరిగా ఉన్నారని గుర్తించాడు. వారి దగ్గరికి వెళ్లి వివరాలు అడగగా  చెప్పలేకపోయారు. దీంతో వారిని గుళ్లో తప్పిపోయారేమో అనుకుని యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో అప్పగించాడు.

అంబర్‌పేటలో కిషన్ రెడ్డి పాదయాత్ర.. అధికారులు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం..

అక్కడ యాదగిరిగుట్ట ఎస్సై వారిని బుజ్జగించి వివరాలు సేకరించారు.  వారు చెప్పిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా సరూర్నగర్, భగత్ సింగ్ కాలనీ నివాసులుగా గుర్తించి అక్కడి పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. అక్కడే పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. ఈ చిన్నారుల తల్లిదండ్రులది ప్రేమ వివాహం అని తేలింది. కొద్ది రోజులు కాపురం చేసిన తర్వాత ముగ్గురు పిల్లలు పుట్టాక వీరి సంసారంలో కలహాలు మొదలయ్యాయి. దీంతో  చిన్నారుల తండ్రి మూడేళ్ల క్రితం భార్యను పిల్లల్ని వదిలేసి వెళ్లిపోయాడు.

భర్త వెళ్లిన కొద్ది కాలానికి ఆమెకు ఒక ఆటో డ్రైవర్ తో పరిచయమయ్యింది. అతనితో సహజీవనం చేస్తోంది. వీరిద్దరికీ ఒక పాప కూడా పుట్టింది. అయితే పిల్లలను ఇలా వదిలేసిన సంగతి స్థానికులకు తెలియదు. ఆ రోజు నుంచి ఆమె కానీ, ఆటో డ్రైవర్ కానీ,  పాప కానీ కనిపించడం లేదు. దీంతో పిల్లలకు సంబంధించిన వారి కోసం పోలీసులు స్థానికులను విచారించారు. పిల్లలకు పెదనాన్న ఉన్నాడని తెలిసి అతనికి సమాచారం ఇచ్చారు. అయితే అతను కూడా తాను అందుబాటులో లేనని చెప్పడంతో ముగ్గురు పిల్లలను  జిల్లా బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.

ఆ తర్వాత రెండు రోజులకు పిల్లల పెదనాన్న వచ్చి వారిని తన తమ్ముడి పిల్లలుగా గుర్తించాడు. అయితే, భార్యతో గొడవల కారణంగా తమ్ముడు వీరికి దూరంగా ఉంటున్నాడు కాబట్టి పిల్లలతో తనకి ఏమాత్రం సంబంధం లేదని తేల్చి చెప్పి వెళ్లిపోయాడు. దీంతో ఈ పిల్లలు ముగ్గురిని బాలల సంరక్షణ సమితి ఎదుట ఈనెల 20న ప్రవేశపెట్టారు. అక్కడ.. పిల్లలు చెప్పిన విషయాలు విని  అందరూ విస్తుపోయారు.

ఈనెల 14వ తేదీన తన తల్లి, మరో వ్యక్తి కలిసి తమను ఆటోలో యాదగిరిగుట్టకు తీసుకువచ్చారని తెలిపారు. ఆ తరువాత తమ కాళ్లు చేతులు, కాళ్లు కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కి.. ముగ్గురిని వదిలేసి వెళ్లిపోయారని తెలిపారు. వాళ్లు వెళ్లిన తర్వాత కొద్దిసేపటికి తాను కట్లు విప్పుకుని చెల్లి, తమ్ముడికి కట్లు కూడా విడిపించినట్లు ఆ ముగ్గురిలో పెద్దవాడైన బాలుడు తెలిపాడు. అయితే ఆటో డ్రైవర్ తో సహజీవనానికి ఈ ముగ్గురు అడ్డువస్తున్నారనే కారణంతోనే తల్లి చిన్నారులను యాదగిరిగుట్టలోవదిలేసి వెళ్లి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ముగ్గురు చిన్నారులు హైదరాబాదులోని శిశువిహార్లో ఒకరు, మధుర నగర్ శిశు విహార్ లో ఇద్దరూ ఉన్నారు. చిన్నారులు తప్పిపోయిన పిల్లలని భావించాం కాబట్టి తాము ఎలాంటి కేసు పెట్టలేదని, పిల్లలు తప్పిపోయారని తమకు ఎలాంటి ఫిర్యాదు కూడా అందలేదని ఎస్ఐ సుధాకర్ తెలిపారు. పిల్లలను సంరక్షించి పోలీస్ స్టేషన్కు చేర్చిన ట్రాఫిక్ పోలీస్ కోటి చాలా బాధ్యతగా వ్యవహరించారని అతని విషయాన్నిఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి..  ప్రశంసించేలా చూస్తామని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios