Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రం యూ టర్న్.. రూ. 625 కోట్లతో మహారాష్ట్రలో ఏర్పాటు....

ఈ ఏడాది డిసెంబర్‌లో ఉత్పత్తి ప్రారంభించే దశకు చేర్చేపనిలో నిమగ్నమయింది. తాజాగా సమాచార హక్కు చట్టం కింద సామాజిక కార్యకర్త రవి కుమార్ వివరాలు అడగగా రైల్వేశాఖ పలు విషయాలు వెల్లడించింది. 

Modi Govt takes U-turn on Kazipet Rail Coach Factory, allocated to maharashtra
Author
Hyderabad, First Published Sep 13, 2021, 12:49 PM IST

తెలంగాణకు కొత్త రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కేటాయింపు అంశాన్ని పరిశీలిస్తామంటూనే రిక్తహస్తం చూపిన రైల్వేశాఖ, అదేసమయంలో మహారాష్ట్రకు దానిని కేటాయించి వేగంగా పూర్తి చేస్తోంది.  తెలంగాణ ఎదురు చూస్తున్న కోచ్ ఫ్యాక్టరీపై ఆశలను ఆవిరి చేస్తూ,  మహారాష్ట్రలోని లాతూర్ కు దాన్ని కేటాయించి దాదాపు పూర్తి చేసింది.

ఈ ఏడాది డిసెంబర్‌లో ఉత్పత్తి ప్రారంభించే దశకు చేర్చేపనిలో నిమగ్నమయింది. తాజాగా సమాచార హక్కు చట్టం కింద సామాజిక కార్యకర్త రవి కుమార్ వివరాలు అడగగా రైల్వేశాఖ పలు విషయాలు వెల్లడించింది. 

రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని  కేంద్రం ఇదివరకు పేర్కొంది.  ఈ మేరకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.  విభజన చట్టంలో దీన్ని పొందుపరచడంతో కోచ్ ఫ్యాక్టరీ వస్తుందేమోనని యావత్తు రాష్ట్రం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూసింది.  

కానీ దేశవ్యాప్తంగా ప్రస్తుత రైల్వే అవసరాలను ఇప్పటికే ఉన్న ఫ్యాక్టరీల తీరుస్తున్నాయని, భవిష్యత్తు అవసరాలకు కూడా అవి సరిపోతాయని ఏడాదిన్నర క్రితం రైల్వేశాఖ తేల్చిచెప్పింది. అప్పట్లోనే సమాచార హక్కు చట్టం రూపంలో రైల్వే శాఖ ఆలోచన లిఖితపూర్వకంగా స్పష్టమైంది. 

కానీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అవసరమే లేదన్న రైల్వే శాఖ,  2018 ఏప్రిల్ లో మహారాష్ట్రలోని లాతూర్ లో దాన్ని ఏర్పాటు అంశాన్ని ప్రతిపాదించింది.  కేవలం ఐదు నెలల్లోనే రూ. 625 కోట్లతో మంజూరు చేసింది.  ఆ వెంటనే పనులు ప్రారంభించి, ఇప్పటికే రూ. 587 కోట్లు ఖర్చు చేసింది.

ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయనున్నట్లు తాజాగా స్పష్టం చేసింది.  ఈ ప్రాజెక్టుల మంజూరు, తిరస్కరణలన్నీ రాజకీయ కారణాల ఆధారంగానే జరుగుతున్నాయని  రవికుమార్ ఆరోపించారు.  రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టును కూడా తెలంగాణ నేతలు సాధించలేకపోయారు అని ఆయన విచారం వ్యక్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios