స్టేషన్ ఘన్‌పూర్ టికెట్ దక్కకపోవడంతో పార్టీ కార్యకర్తల ముందు బోరున విలపించిన తాటికొండ రాజయ్య వద్దకు బీఆర్ఎస్ అధిష్టానం పల్లా రాజేశ్వర్ రెడ్డిని పంపింది. కానీ, రాజయ్య నివాసం వద్ద లేకపోవడంతో ఆయన అనుచరులతో పల్లా భేటీ అయ్యారు. రాజయ్యకు పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని చెప్పారు. 

హైదరాబాద్: రాష్ట్రంలోని 119 స్థానాలకు గాను 115 స్థానాల్లో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఏడు స్థానాల్లో మార్పులు చేశారు. మిగితా అన్ని చోట్ల సిటింగ్‌లకే అవకాశం కల్పించారు. మారిన స్థానాల్లో స్టేషన్ ఘన్‌పూర్ కూడా ఉన్నది. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు బీఆర్ఎస్ మళ్లీ టికెట్ ఇవ్వలేదు. ఈ స్థానంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి అవకాశం ఇచ్చింది.

ఈ నేపథ్యంలో తాటికొండ రాజయ్య టికెట్ దక్కనందును బోరున విలపించారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఆవేదనకు లోనయ్యారు. అయినా తాను సీఎం కేసీఆర్ గీసిన గీతను దాటబోనని స్పష్టం చేశారు. కేసీఆర్ చెప్పినట్టే వింటానని స్పష్టం చేశారు. 

దీంతో పార్టీ అధిష్టానం తాటికొండ రాజయ్యకు భరోసా ఇవ్వడానికి పల్లా రాజేశ్వర్ రెడ్డిని పురమాయించింది. తాటికొండ రాజయ్య వద్దకు వెళ్లాలని ఆదేశించింది. దీంతో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.. తాటికొండ రాజయ్య నివాసానికి వెళ్లారు. కానీ, రాజయ్య నివాసంలో లేరు. 

దీంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజయ్య అనుచరులతో భేటీ అయ్యారు. తాటికొండ రాజయ్యకు బీఆర్ఎస్ సముచిత స్థానం కల్పిస్తుందని, మరో రెండు మూడు రోజుల్లో తాము కేసీఆర్‌ను కలుస్తామని చెప్పారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యలు కలిసి గులాబీ జెండా ఎగురేస్తారని ఆశాభవం వ్యక్తం చేశారు.

Also Read: చంద్రయాన్ 3 సక్సెస్ కావాలని పాక్ జాతీయురాలు సీమా హైదర్ ఉపవాసం (Video)

ఇదిలా ఉండగా ఖమ్మంలోనూ ఇదే పద్ధతిని బీఆర్ఎస్ అధిష్టానం అవలంభించింది. పాలేరు టికెట్ కోసం ఆశపడి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భంగపడ్డారు. పాలేరు టికెట్‌ను బీఆర్ఎస్ మళ్లీ కందళ కే ఇచ్చారు. దీంతో తుమ్మల నాగేశ్వర రావు అసంతృప్తితో ఉన్నారు. ఆయన వద్దకు ఎంపీ నామా నాగేశ్వరరావును బీఆర్ఎస్ అధిష్టానం పంపింది. కేసీఆర్ ఆదేశాల మేరకు నామా నాగేశ్వరరావు.. తుమ్మల నాగేశ్వరరావు ఇంటి వద్ద కు వెళ్లి కలిసి మాట్లాడారు.