తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడం వ్యూహాత్మక నిర్ణయమేనని కల్వకుంట్ల కవిత అన్నారు.
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే బిఆర్ఎస్ అభ్యర్థులందరినీ ఒకేసారి ప్రకటించి తెలంగాణ రాజకీయాలను హీటెక్కించారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. అయితే అభ్యర్థుల ప్రకటనను పరిశీలిస్తే కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని స్ఫష్టంగా అర్థమవుతుందని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. సిట్టింగ్ లకు టికెట్ కేటాయించడం, కేసీఆర్ రెండు చోట్ల పోటీచేయడానికి ఓటమి భయమే కారణమని అంటున్నారు. ప్రతిపక్ష పార్టీల వ్యాఖ్యలపై కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ రియాక్ట్ అయ్యారు.
బిఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ గజ్వెల్ తో పాటు కామారెడ్డిలో పోటీ చేయడం వ్యూహాత్మక నిర్ణయమని కవిత అన్నారు. కేసీఆర్ తెలంగాణలో ఎక్కడినుండి పోటీచేసినా గెలిచే సత్తావున్న నాయకుడు... అలాంటిది ఆయన ఓటమి భయంతోనే కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడనడం హాస్యాస్పదంగా వుందన్నారు. గజ్వేల్, కామారెడ్డిలోనే కాదు తెలంగాణలోని అత్యధిక స్థానాల్లో గెలిచి బిఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని కవిత ధీమా వ్యక్తం చేసారు.
ఇక బిఆర్ఎస్ పార్టీ టికెట్ల కేటాయింపులో మహిళలకు అన్యాయం జరిగిందని... 115 స్థానాల్లో కేవలం ఏడుగురు మహిళలకే చోటు కల్పించడమేంటన్న విమర్శలకు కవిత కౌంటర్ ఇచ్చారు. మహిళా బిల్లుపై ఏనాడూ స్పందించని నాయకులంతా బిఆర్ఎస్ టికెట్ల కేటాయింపుపై స్పందించారని అన్నారు. మహిళా రిజర్వేషన్ల గురించి ప్రస్తావిసతూ తనను విమర్శించిన నాయకులందరికీ కవిత ధన్యవాదాలు తెలిపారు.
అన్ని రాష్ట్రాల స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి... కానీ బిజెపి పాలిత ఉత్తర ప్రదేశ్ లో మాత్రం అమలుకావడం లేదని కవిత అన్నారు. ఇక మోదీ కేబినెట్ లో ఇద్దరు మహిళా మంత్రులు, నెహ్రూ కేబినెట్ లో ఒక్కరు మహిళా మంత్రి వున్నారు... ఇలాంటి చరిత్ర కలిగిన బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మహిళలకు అన్యాయం జరిగిందని మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఆమోదం కోసం వచ్చే డిసెంబర్ లో మళ్లీ ధర్నా చేపట్టనున్నట్లు కవిత ప్రకటించారు. ఆ ధర్నాకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణను ఆహ్వానిస్తానని కవిత తెలిపారు.
