నేడు తెలంగాణకు అమిత్ షా : ట్విట్టర్ లో కేంద్ర హోంమంత్రిపై ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం..
నేడు తెలంగాణలో పర్యటించనున్న కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీనేత అమిత్ షా మీద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్లో ప్రశ్నల వర్షంతో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్ : కేంద్ర మంత్రి అమిత్ షా పై ట్విట్టర్ లో ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్ల బకాయిలు, GST పరిహారం, పెరుగిన ఇంధన ధరలు, NITI అయోగ్ సిఫార్సుల విస్మరణ లాంటి అనేక అంశాలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు సూటి ప్రశ్రలు సంధించారు. ఆ ప్రశ్నల పరంపర చూడండి...
1. రూ. 3000 కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు?
2. బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్ రూ. 1350 కోట్లు, GST పరిహారం రూ. 2247 కోట్ల సంగతేమిటి?
3. ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బణానికి మీ సమాధానం ఏమిటి?
4, బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెరిగిన నిరుద్యోగం, మతపరమైన అల్లర్లు పై మీ సమాధానం ఏమిటి?
5. భారత్‌ను అత్యంత ఖరీదైన ఇంధనం, LPGని విక్రయించడంలో అగ్రగామి దేశంగా మార్చడంపై మీ సమాధానం ఏమిటి?
6. అమిత్ షా జీ, ఈ రోజు మీరు తెలంగాణ ప్రజలను కలిసినప్పుడు గత 8 సంవత్సరాలలో తెలంగాణకు ఒక్క IIT, IIM, IISER, IIIT, NID, మెడికల్ కాలేజీ లేదా నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందో తెలంగాణ బిడ్డలకు వివరించండి.
7. మిషన్ కాకతీయ & మిషన్ భగీరథకు రూ. 24,000 కోట్ల నిధులు ఇవ్వాలని NITI అయోగ్ సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఎందుకు విస్మరించిందో చెప్పండి?
8. అమిత్ షా జీ, కర్ణాటకలోని ఎగువ భద్ర నీటిపారుదల ప్రాజెక్టుకు, కెన్ బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించి, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ & కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా నిరాకరించడం కేంద్రప్రభుత్వం కపటత్వం కాదా? ?
అంటూ ప్రశ్నలు సంధించారు.
కాగా, కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణ వేడెక్కింది. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో అమిత్ షాకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. ఎనిమిదేళ్లు గడిచినా తెలంగాణపై బీజేపీకి కక్ష, వివక్ష అలానే ఉందని మంత్రి ఆరోపించారు. కేందం కడుపునింపుతున్న తెలంగాణ కడుపు కొట్టడం మానడం లేదని ఫైరయ్యారు.
ప్రతీసారి నేతలు వచ్చి స్పీచులు దంచి.. విషం చిమ్మి.. పత్తా లేకుండా పోవుడు కేంద్ర నాయకులకు అలవాటుగా మారిందని కేటీఆర్ దుయ్యబట్టారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చని బీజేపీ.. గుజరాత్‌కు మాత్రం ఇవ్వని హామీలను ఆగమేఘాల మీద అమలు చేయడం దేనికి సంకేతమని మంత్రి ప్రశ్నించారు.
ఆత్మగౌరవ పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని కూడా ప్రశ్నించడం బీజేపీకే చెల్లిందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైనదని.. మరోసారి తెలంగాణ గడ్డ మీద అమిత్ షా అడుగుపెడుతున్న వేళ.. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రజల సాక్షిగా కేంద్రం దృష్టికి తేవడంతోపాటు, వాటి కోసం తెగేదాక కొట్లాడటం మా భాద్యత అని కేటీఆర్ గుర్తు చేశారు. అందుకే... తెలంగాణ సమాజం ముక్తకంఠంతో నినదిస్తున్న అనేక కీలక అంశాలు మీ దృష్టికి తీసుకువస్తున్నానని ఆయన లేఖలో పేర్కొన్నారు.