కేసీఆర్ సర్కార్ తప్పుచేసింది..: ఎమ్మెల్సీ గోరటి వెంకన్న సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ సర్కార్ చేసిన తప్పులవల్లే బిఆర్ఎస్ పార్టీ బద్నాం అయ్యిందని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అధికారంలో వుండగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయాలను వ్యతిరేకించడం కాదు కదా మాట్లాడేందుకు కూడా నాయకులు వెనకాడేవారు. ఇష్టమున్నా లేకపోయినా బిఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ నిర్ణయాలను పొగడాల్సిన పరిస్థితి ఆ పార్టీ నాయకులకు వుండేంది. కానీ ఇటీవల ఓటమి తర్వాత ఆ పార్టీ నాయకుల తీరుతో మార్పు వచ్చింది. తాజాగా శాసన మండలిలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న బిఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసారు.
రైతు బంధు విషయంలో బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం సరిగ్గా లేదనేలా వెంకన్న కామెంట్స్ చేసారు. వందల ఎకరాలున్న బడా బాబులకు కాకుండా వ్యవసాయం చేసే రైతులకే పెట్టుబడి సాయం చేసివుంటే బావుండేదన్నారు. కానీ గత ప్రభుత్వం అలాకాకుండా హీరో హీరోయిన్లు, బడా వ్యాపారులు, ఐఏఎస్, ఐపిఎస్ లకు కూడా రైతు బంధు ఇచ్చిందని గుర్తుచేసారు. ఇది మంచిది కాదని తాను అప్పుడే చెప్పానని... ఇప్పుడు కూడా అదే చెబుతున్నానంటూ బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అమలుచేసిన విధానాన్ని గోరటి వెంకన్న తప్పుబట్టారు.
గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా కాంగ్రెస్ సర్కార్ రైతు బంధును అవసరమున్న రైతులకే అందించాలన్నారు. కేవలం 10 ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన రైతులకే పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వానికి సూచించారు. చిన్న సన్నకారు రైతులకు రైతు బంధు ద్వారా చేసే పెట్టుబడి సాయం ఎంతగానో ఉపయోగపడుతున్నాయని గోరటి వెంకన్న అన్నారు.
Also Read MLC Kavitha: సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్.. ‘ఆ స్ఫూర్తిని ప్రభుత్వం కొనసాగించాలి’
ఇక బిఆర్ఎస్ హయాంలో మేధావులు వేధింపులకు గురయ్యారని గోరటి వెంకన్న తెలిసారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదంరాం ఇంటి తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేయడం... హరగోపాల్ పై ఉపా కేసులు పెట్టడం దారుణమని అన్నారు. అధికారుల ఓవర్ యాక్షన్ వల్లే బిఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని... కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి తప్పులు చేయొద్దని సూచించారు. ఇష్టారీతిగా వ్యవహరించే అధికారులను కట్టడి చేయాలని రేవంత్ సర్కార్ ను గోరటి వెంకన్న సూచించారు.
ఇక గత బిఆర్ఎస్ ప్రభుత్వం కులతత్వాన్ని ప్రోత్సహించేలా వ్యవహరించిందంటూ వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేసారు. కుల సంఘాలకు స్థలాలు కేటాయించడం, భవనాలు కట్టించడం కులతత్వాన్ని ప్రోత్సహించడమేనని అన్నారు. ఇలాంటి పొరపాట్లే బిఆర్ఎస్ కొపం ముంచాయని గోరటి వెంకన్న అన్నారు.
దేశ తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ, ప్రస్తుత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులని వెంకన్న అన్నారు. కేసీఆర్ జనాల గుండెల్లో నిలిచిపోయారు... కానీ కొందరు అధికారుల తీరువల్ల బిఆర్ఎస్ పార్టీకి చెడ్డపేరు వచ్చిందన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అప్రతిష్టపాలు కావడానికి కొందరు అధికారులే కారణమని శాసన మండలిలో గోరటి వెంకన్న పేర్కొన్నారు.