నాగర్‌కర్నూల్: కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీని వీడనున్నారు. ఈ నెల 9వ తేదిన ఆయన
టిఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారని
సమాచారం.నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని
తీవ్రంగా వ్యతిరేకించిన దామోదర్ రెడ్డి పార్టీ మారేందుకు
రంగం సిద్దం చేసుకొంటున్నారు.


మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి  బిజెపి నుండి కాంగ్రెస్
పార్టీలో చేరారు. అయితే నాగం జనార్ధన్ రెడ్డిని కాంగ్రెస్
పార్టీలోకి రాకుండా మాజీ జడ్పీ ఛైర్మెన్, ఎమ్మెల్సీ దామోదర్
రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. రాహుల్ గాంధీని కలిసి తన
అభ్యంతరాలను కూడ తెలిపారు.

అయితే దామోదర్ రెడ్డి అభ్యంతరాలను కూడ కాదని నాగం
జనార్ధన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని దామోదర్
రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై దామోదర్
రెడ్డి పలుమార్లు బహిరంగంగానే తన నిరసనను వ్యక్తం
చేశారు.

నాగం జనార్ధన్ రెడ్డికి టిక్కెట్టు ఇస్తే ఓడిస్తామని కూడ
దామోదర్ రెడ్డి హెచ్చరించారు. కానీ, నాగం జనార్ధన్ రెడ్డిని
కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొన్నారు. దీంతో తీవ్ర అసంతృప్తితో
ఉన్న దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాలని
భావిస్తున్నారు.

నాగం జనార్ధన్ రెడ్డి టిడిపిలో ఉన్న సమయంలో తనతో
పాటు తన వెంట ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులను తీవ్రంగా
ఇబ్బందులకు గురిచేసినట్టుగా  దామోదర్ రెడ్డి చెప్పారు.

తన అభ్యంతరాలను కూడ కాదని నాగం జనార్దన్ రెడ్డిని
కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడంపై అసంతృప్తితో ఉన్న
దామోదర్ రెడ్డితో టిఆర్ఎస్ నేతలు టచ్‌లోకి వెళ్ళారు.

టిఆర్ఎస్ లో చేరేందుకు దామోదర్ రెడ్డి కూడ
సానుకూలంగా ఉన్నారని సమాచారం. ఈ మేరకు తన
అనుచరులతో దామోదర్ రెడ్డి మంతనాలు జరుపుతున్నారు.

అన్నీ అనుకొన్నట్టుగా జరిగితే జూన్ 9వ తేదిన దామోదర్
రెడ్డి టిఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని సమాచారం.

ఈ విషయం తెలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దామోదర్
రెడ్డిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేసింది. మాజీ మంత్రి
డికె అరుణ కూడ ఆయనను తొందరపడి నిర్ణయాలు
తీసుకోవద్దని కూడ సూచించిందని దామోదర్ రెడ్డి
సన్నిహితులు చెబుతున్నారు.