Asianet News TeluguAsianet News Telugu

నా పరిస్థితి ఏంటంటున్న ఎమ్మెల్యే

రాష్ట్ర విభజన అంశం పార్టీలను, రాష్ట్రాలను ఎంత కోలుకోలేని దెబ్బతీసిందో తెలియదు కానీ ఓ ఎమ్మెల్యేను మాత్రం నిట్టనిలువునా ముంచేసింది. ఒక రాష్ట్రానికి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆ ప్రజాప్రతినిధి విభజన అనంతరం జరిగిన పరిణామాలు ఏ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేనో అని తేల్చలేకపోతున్నాయట. 

MLA Sunnam rajaiah political plan
Author
Bhadrachalam, First Published Aug 25, 2018, 5:17 PM IST

భద్రాచలం: రాష్ట్ర విభజన అంశం పార్టీలను, రాష్ట్రాలను ఎంత కోలుకోలేని దెబ్బతీసిందో తెలియదు కానీ ఓ ఎమ్మెల్యేను మాత్రం నిట్టనిలువునా ముంచేసింది. ఒక రాష్ట్రానికి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆ ప్రజాప్రతినిధి విభజన అనంతరం జరిగిన పరిణామాలు ఏ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేనో అని తేల్చలేకపోతున్నాయట. 

ఆ ఎమ్మెల్యేకు సైతం తాను ఏ రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. దీంతో వచ్చే ఎన్నికల్లో తన రాజకీయ భవితవ్యంపై ఆందోళనగా ఉన్నారట....ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు.....ఆయనకు విభజనకు లింకేంటి అనుకుంటున్నారా..ఆ ఎమ్మెల్యే సున్నం రాజయ్య...భద్రాచలం నియోజకవర్గం.  

సున్నం రాజయ్య కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యే. ప్రస్తుతం భద్రాచలం ఎమ్మెల్యేగా తెలంగాణ శాసన సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వజీడు,
వెంకటాపురం, చెర్ల, దుమ్ముగూడెంతోపాటు మరో ఏడు మండలాలు ఉండేవి. అంటే మెుత్తం 11 మండలాలు భద్రచలం నియోజకవర్గం పరిధిలో ఉండేవి. అయితే విభజన అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈనియోజకవర్గంలోని ఏడు మండలాలను పోలవరం ముంపు మండలాలు గుర్తించి ఏపీకి విలీనం చేసింది. 

దీంతో సున్నం రాజయ్య కేవలం వజీడు, వెంకటాపురం, చెర్ల, దుమ్ముగూడెం మండలాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గెలిచింది మాత్రం 11 మండలాల ఎమ్మెల్యేగా....ఇప్పుడు ఉన్నది మాత్రం కేవలం నాలుగు మండలాల ప్రతినిధిగా...దీంతో రాజయ్య పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది...రాష్ట్ర విభజన ప్రభావంతో రాజయ్య రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. 

అసలు విషయానికి వస్తే 2014లో రాష్ట్రవిభజన అనంతరం ఏపీకి 175, తెలంగాణకు 119 అసెంబ్లీ  నియోజకవర్గాలను కేటాయించింది కేంద్రం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత భద్రాచలం డివిజన్‌లోని ఏడు మండలాలను పోలవరం ముంపు మండలాలుగా తేల్చి వాటిని ఏపీలో కలపాలని చంద్రబాబు నాయుడు పట్టుబట్టారు. 

దీంతో ఆరు ముంపు మండలాలతో పాటు.. మరో మండలంలోని ఏడు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ కేంద్ర కేబినెట్ ప్రకటించింది. భద్రాచలం నియోజకవర్గంలోని కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, భద్రాచలం రూరల్ మండలాలను తూర్పుగోదావరి జిల్లాలో, అశ్వారావుపేట నియోజకవర్గంలోని కుక్కునూరు, వేలూరుపాడు, బూర్గంపాడు మండలంలోని ఏడు గ్రామాలను పశ్చిమగోదావరి జిల్లాలో విలీనం చేస్తూ కేంద్ర కేబినేట్ తీర్మానించింది.  వెంటవెంటనే పార్లమెంట్ ఆమోదముద్ర కూడా వేసింది. 

అయితే రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నాయుడు తూర్పు, పశ్చిమ, విశాఖ, విలీనమండలాలను కలిపి ఒక ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చెయ్యాలని భావించారు. అందుకు ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. ఏజెన్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాగా వేసిందనో ఏంటో తెలియదు కానీ జిల్లా ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అలాగే విలీన మండలాలను ప్రత్యేక నియోజకవర్గంగా కేటాయించి అరకు పార్లమెంట్ పరిధిలోకి తీసుకురావాలని ప్రయత్నాలు కూడా జరిగాయి. ఆ ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి

 భద్రాచలం నియోజకవర్గంలోని ఏడు మండలాలు ఏపీకి తరలిపోవడంతో రాజయ్య తలలు పట్టుకుంటున్నారట. సాక్షాత్తు ఎమ్మెల్యే సున్నం రాజయ్య సొంతూరు సున్నంవారి పాలెం కూడా ఏపీలోని రంపచోడవరం నియోజకవర్గంలో కలిసిపోయింది. అంటే విలీన మండలాల బాధితుల్లో సున్నం రాజయ్య కూడా ఒకరన్నమాట.  

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సున్నం రాజయ్య ఎక్కడ నుంచి పోటీ చేస్తారా అన్న సందేహం నెలకొంది. అంతా తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల విభజన ఉంటుందని భావించారు...కానీ తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల విభజన ఉండదని కేంద్రం తేల్చి చెప్పడంతో సున్నం రాజయ్య తన రాజకీయ భవిష్యత్ పై ఆలోచిస్తున్నారట. భద్రాచలంలో కేవలం నాలుగు మండలాలే ఉండటం అక్కడ టీఆర్ఎస్ ఫుల్ గా ఫోకస్ పెట్టడంతో సున్నం రాజయ్య ఆలోచనలో పడ్డారట. తన స్వగ్రామంతోపాటు మరో ఏడు మండలాల్లో తనకు పట్టు ఉండటంతో ఏపీకి వెళ్లి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచిస్తున్నారట. అందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారట.  

మరోవైపు టీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గంపై ఫుల్ గా ఫోకస్ పెట్టింది. గెలుపే పరమావధిగా భారీ స్కెచ్ వేస్తోంది. టీఆర్ఎస్ ప్లాన్ లు ఎమ్మెల్యే గారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయట. ఒకప్పుడు అసలు పట్టులేని టీఆర్ఎస్ రోజురోజుకు విస్తరిస్తుండడంతో ఇక నియోజకవర్గ మార్పుపై ప్లాన్ చేస్తున్నారన్నది టాక్.  
ఇప్పటికే పోలవరానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విలీన మండలాల్లో ఉద్యమం జరుగుతుంది. ఆ ఉద్యమానికి ఆది నుంచి ఎమ్మెల్యే రాజయ్య మద్దతు ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సున్నం  రాజయ్య తెలంగాణ కంటే ఏపీలోని రాజకీయాలపైనే దృష్టిసారించారట. రంపచోడవరం నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా బరిలోకి దిగాలని దాదాపుగా నిర్ణయించుకున్నారట. 

అయితే తన సీపీఎం సభ్యత్వాన్ని తెలంగాణ నుంచి ఏపీకి మార్చాలని కోరనున్నట్లు స మాచారం. ఒకవేళ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే రంపచోడవరం నుంచి పోటీ చేసేందుకు రెడీ అంటున్నారట సున్నం రాజయ్య. 

Follow Us:
Download App:
  • android
  • ios